Sunday, April 28, 2024

ఏప్రిల్‌ 2న అప్పన్న కళ్యాణం.. 23న సింహాద్రినాధుడి నిజరూపదర్శనం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఏప్రిల్‌ 2న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా చైత్రశుధ్ద ఏకాదశి పర్వదినం రోజు సింహాద్రినాధుడు కళ్యాణ మహోత్సవం సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఏప్రిల్‌ 1న కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 2న కళ్యాణాన్ని పురస్కరించుకొని సాయంత్రం ఎదురు సన్నాహం, కొట్నాల ఉత్సవం, రాత్రి 8 గంటలకు రధోత్సవం, 9.30 గంటలకు కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిపించనున్నారు. మరో వైపు ఏప్రిల్‌ 23న అప్పన్న నిజరూపదర్శనం భక్తులకు కల్పించనున్నారు. ఏడాది పొడవున సుగంద భరిత చందనంలో కొలువుండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు తన నిజరూపదర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చందనయాత్రగా, చందనోత్సవంగా పిలవడం జరుగుతుంది.

- Advertisement -

ఆ రోజు తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు భక్తులకు స్వామి నిజరూపదర్శన భాగ్యం కల్పించి తదుపరి వివిధ రకాల ఫలపుష్ప శీతలాదులతో కూడిన సహస్ర ఘటాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం తిరిగి తొలివిడతగా సిరిలొలికించే సింహాద్రినాధుడికి మూడు మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పిస్తారు. ఒకే నెలలో రెండు ప్రధానోత్సవాలు జరగనుండడంతో ఆలయ వర్గాలు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు సుమారు రూ.3 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఆలయ ఇవో వి.త్రినాధరావు సోమవారం సాయంత్రం ఆలయ వర్గాలుతో ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

మార్చి 1న అప్పన్న ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి సభ్యులంతా చర్చించి తీర్మాణాలు చేయనున్నారు. వీటి తో పాటు ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంధించి కూడా సభ్యులు చర్చించనున్నారు. ధర్మకర్తల మండలి సమావేశానికి సంబంధించి 50 అంశాలుతో అజెండా రూపకల్పన చేసి సభ్యులందరికి పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement