Sunday, April 28, 2024

AP – 31 మందిని చంపిన హంతకుడు చంద్రబాబు – జగన్

నాయుడుపేట – ఎన్నికల వేళ పెన్షన్లు పంపిణీ, వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ కుట్రలపై ఏపీ సీఎం జగన్‌ మండిపడ్డారు. నాయుడుపేటలో గురువారం నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న జగన్‌.. చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు అందించామని.. కానీ దాన్ని జీర్ణించుకోలేక.. అసూయతో పెన్షన్లు అడ్డుకున్నారని జగన్‌ అన్నారు. నిమ్మగడ్డ రమేశ్‌తో ఈసీకీ ఫిర్యాదు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. వెయ్యి ఇస్తున్న పెన్షన్‌ను రూ.3వేలకు పెంచామని గుర్తుచేశారు. పేదలకు వైసీపీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు చెడిపోయాయని.. దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చెబితేనే పెన్షన్లు ఆగిపోయాయని టీడీపీ అభ్యర్థులు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. పెన్షన్‌ కోసం వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని అన్నారు. 31 మందిని చంపిన హంతకుడు చంద్రబాబు అని విమర్శించారు. ఓపిక పట్టండి.. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే చేస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి సేవలందిస్తానని స్పష్టం చేశారు.

- Advertisement -

చంద్రబాబు నాయుడు 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని.. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే ప్రజలకు గుర్తొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలే అని విమర్శించారు. చంద్రబాబుకు నా అనే వాళ్లంతా నాన్‌ లోకల్స్‌ అని పేర్కొన్నారు. ఏపీలో పేద ప్రజలంతా తన వాళ్లే అని చెప్పారు. రాష్ట్రాన్ని జన్మభూమి కమిటీల ముఠా దోచుకుందని విమర్శించారు. మనకు కుట్రలు, పొత్తులు, జిత్తులతో పనిలేదని అన్నారు.

చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో పోటీ పడాలని తాను అనుకోవడం లేదని జగన్‌ స్పష్టం చేశారు. చంద్రబాబులా మోసపు వాగ్దానాలు చేయనని అన్నారు. మీ జగన్‌ అబద్ధాలు చెప్పడు.. మోసాలు చేయడని అన్నారు. సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో పెట్టనని చెప్పారు. మేనిఫెస్టోలో లేనివి కూడా చాలా అమలు చేశామని అన్నారు. తనకు పేద ప్రజలపై ఉన్న ప్రేమ.. దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి లేదని తెలిపారు. తాను చేయలేని ఏ పథకమైనా చంద్రబాబు జేజమ్మ కూడా అమలు చేయలేరని పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement