Friday, May 3, 2024

నీటిని రాజకీయాలకు వాడుకోవద్దు: సీఎం జగన్‌

తెలుగు రాష్ట్రాల జల వివాదంపై ఇరు ప్రాంతాల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నీటి విషయంపై ఇరు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు కేంద్రానికి ఫిర్యాదు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుండగా… తెలంగాణే అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ ఏపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంతోనూ విబేధాలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనే కోరుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలుపెట్టలేదని జగన్‌ గుర్తు చేశారు.

తెలంగాణలో కొంతమంది మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిస్తేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అని.. ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలుసని సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి 2015 జూన్‌లో నీటి కేటాయింపులు సంతకాలు కూడా చేశారని చెప్పారు. రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 360 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు మొత్తం 811 టీఎంలకు సంబంధించి కేటాయిపుంలు చేశారని వివరించారు. శ్రీశైలంలో 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావన్నారు. గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకుపైగా నీళ్లు 20 నుంచి 25 రోజులకు మించి లేవని ఆయన చెప్పారు.

తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్ట్‌లకు 800 అడుగులలోపే నీళ్లు తీసుకుంటున్నారని సీఎం జగన్‌ అన్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని, 800 అడుగుల్లోపు తెలంగాణ వాడుకున్నప్పుడు ఏపీ వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఆనాడు తెలంగాణలో ప్రాజెక్ట్‌లు కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా అని ఘాటుగా ప్రశ్నించారు. రైతులు ఏ ప్రాంతంలో ఉన్నా రైతులేనని, రైతుల కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. నీటిని రాజకీయాలకు వాడుకోవద్దని సీఎం జగన్‌ సూచించారు.

రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలన్నారు. సఖ్యతతో సమస్యలను ఎదుర్కోవాలని తెలిపారు. దేవుడి దయతో ఈసారి వర్షాలు బాగా పడాలని, రైతన్నలకు మంచి చేసే అవకాశం ఇవ్వాలి పేర్కొన్నారు. తాగడానికీ, రైతున్నకు నీళ్లు ఇవ్వడానికీ అందరం కూడా ఒక్కటి కావాలన్నారు. అలాంటి నీటి విషయంలో రాజకీయాలు జరుగుతుంటే.. చూడలేక ఈ విషయాలు మాట్లాడుతున్నానని చెప్పారు. పక్కరాష్ట్రంతోనైనా తమకు సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటామని సీఎం జగన్ తెలిపారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: షర్మిల పార్టీకి కాంగ్రెస్ ఎంపీ మద్దతు!

Advertisement

తాజా వార్తలు

Advertisement