Tuesday, April 30, 2024

ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్!?

ఏపీలో కరోనా వైరస్ ప్రళయం కొనసాగుతోంది. రాష్ట్రంలో కఠిన కర్ఫ్యూ అమలు చేస్తున్నా.. ప్రతి రోజు 20 వేలపై చిలుకు కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతున్నాయి. అయితే, కరోనా మాత్రం కట్టడి కావడం లేదు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో ఫీవర్ సర్వేలోనూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. చాలా గ్రామాల్లో సగానికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. చాలామందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నా.. పరీక్షలు చేయించుకోవాడానికి ముందుకు రావడం లేదని గుర్తించినట్టు తెలుస్తోంది. అందరికీ పరీక్షలు నిర్వహిస్తే.. పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ ప్రభుత్వం ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటుంది. కానీ, ఇప్పటికే మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టేసింది. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా నిర్వహించే పరీక్షలలో పాజిటివిటీ రేటు పదిశాతం దాటితే ప్రమాదకరంగా భావించాల్సి ఉంది.

ఏపీలో ఇప్పటికే ఈ పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి మించింది. ఐసీఎంఆర్ పది శాతం దాటితేనే లాక్ డౌన్ విధించాలని సూచిస్తోంది. కానీ ఏపీలో మాత్రం పాజిటివ్ రేట్ 20 శాతం దాటుతోంది. ఏపీలోని 11 జిల్లాలలో పాజిటివిటీ 20 శాతానికి మించిందని నిర్ధారణవగా విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో మరింత ఆందోళనకర ప్రమాద పరిస్థితులు ఉన్నాయి. దీంతో మరో 6 నుండి 8 వారాల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూ కాకుండా.. లాక్ డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తుంది.

ఏపీలో కర్ఫ్యూతో ఏ మాత్రం లాభం కనిపించడం లేదు. మధ్యాహ్నాం 12 గంటల వరకు సమయం ఇవ్వడంతో జనం అవసరం లేకున్నా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతోనే కరోనా కట్టడి కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కర్ఫ్యూ కన్నా.. లాక్ డౌనే మేలు అనే అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ కు కూడా అధికారులు ఇదే విషయం చెప్పినట్టు సమాచారం. సంపూర్ణ లాక్ డౌన్ లేకుంటే కేసులు కంట్రోల్ కావడం కష్టమే అని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి : సరిహద్దుల వద్ద అంబులెన్స్ ల క్యూ… కరోనా బాధితులు ఆర్తనాదాలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement