Thursday, May 2, 2024

చిన్నారిఫై ఆయా ఘాతుకం.. అమ్మ‌కావాల‌ని ఏడిస్తే, మూతిపై అట్ల‌కాడ‌తో వాత‌లు!

అనంతపురం, (ప్ర‌భ న్యూస్‌): అమ్మ కావాలంటూ ఏడుస్తున్న మూడేళ్ల చిన్నారికి అంగన్‌వాడీ కేంద్రం సహాయకురాలు వాత పెట్టింది. భయపడి ఇంటికి పరిగెత్తిన ఆ పసివాడిని కొడుతూ మళ్లీ కేంద్రానికి తీసుకెళ్లిన ఘటన అనంతపురంలో వెలుగులోకి వచ్చింది. బాధితుడి తల్లిదండ్రులు లక్ష్మి, సంగారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలోని కోవూరునగర్‌ అంగన్‌వాడీ కేంద్రానికి ఎప్పటిలాగే లక్ష్మి తన మూడేళ్ల కుమారుడు ఈశ్వర్‌కృష్ణను తీసుకెళ్లి వదిలిపెట్టారు. కొద్దిసేపటికి అమ్మ కావాలంటూ చిన్నారి ఏడుస్తుంటే.. అక్కడి సహాయకురాలు వంటగదిలోకి తీసుకెళ్లి కడ్డీతో మూతి మీద వాత పెట్టింది.

ఆ పసివాడు బాధతో విలవిల్లాడుతూ సమీపంలోనే ఉన్న ఇంటికి పరిగెత్తాడు. అతడి వెంట పడిన ఆయా ఓ చెట్టు కొమ్మతో కొట్టుకుంటూ మళ్లీ కేంద్రానికి తీసుకొచ్చింది. శుక్రవారం ఉదయం కుమారుడి మూతి మీద వాత చూసిన బాలుడి తండ్రి విషయం తెలుసుకుని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి ఆయాను ప్రశ్నించారు. ఆమె సరైన సమాధానం చెప్పకుండా ఎదురు తిరగడం విశేషం. చిన్నారి మూతిపై వాత మాత్రమే కాదు.. వీపు, తొడలపైనా కొట్టినట్లు చారలు పడ్డాయి.

ఏం జరిగిందో విచారిస్తా : లలిత, సీడీపీఓ, అనంత ఐసీడీఎస్‌
చిన్నారిని కొట్టారన్న విషయమై మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అసలు అక్కడ ఏం జరిగిందో అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి విచారిస్తా. నిజమని తేలితే చర్యలు తీసుకుంటా..

Advertisement

తాజా వార్తలు

Advertisement