Thursday, May 9, 2024

Ananthapur – విద్యుత్ కోతలపై జ‌గ‌న్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పరిటాల సునీత

కనగానపల్లి అక్టోబర్ 12 ప్రభ న్యూస్ – లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు విద్యుత్ కోతలతో నిలువునా దెబ్బతింటున్నాయని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. పంటలు ఎండుతున్న తీరు చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటుంటే ఈ గుడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆమె నిలదీశారు. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండల వ్యాప్తంగా గత రెండు నెలలుగా విద్యుత్ కోతలతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ విషయంపై పరిటాల సునీత క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ రైతుల ఇబ్బందులు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా కనగానపల్లి మండలం నరసంపల్లి పంచాయతీలోని గుదివాండ్లపల్లి, సోమరవాండ్లపల్లి, నరసంపల్లి గ్రామాల్లో ఆమె పర్యటించారు. రైతులతో నేరుగా మాట్లాడారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో చీనీ, అరటి, టమోటా, వరి, వేరుసెనగ తదితర పంటలు సాగు చేస్తున్నారు. విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే వరి పంట ఎండిపోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

టమోటా, చీనీ పంటలు కీలక దశలో ఉన్నాయని.. ఇలాంటి సమయంలో 9గంటలు కాదు కదా.. కనీసం 3గంటలు కూడా విద్యుత్ అందడంలేదన్నారు. దీంతో బత్తాయి మొక్కల పూత, పిందె రాలిపోతోందని కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటికే పంటలకు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టామని.. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడి కాదు కదా.. కనీసం ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని మాజీ మంత్రి సునీత దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యుత్ సరఫరా సరిగా లేక లో ఓల్టేజ్ కారణంగా మోటార్లు, స్టాటర్లు కాలిపోతున్నాయన్నారు. నరసంపల్లి పంచాయతీలోనే గత నెలలో 35 మోటర్ల వరకు లో వోల్టేజ్ వల్ల కాలిపోయాయని… నిన్న ఒక్కరోజు లో వోల్టేజ్ వల్ల 15 మోటర్ల వరకు కాలిపోయాయన్నారు.

ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు 9గంటల ఉచిత విద్యుత్ అందిస్తామన్న జగన్ రెడ్డి ఇప్పుడు కనీసం 4 గంటలు కూడా అందించడం లేదన్నారు. గతంలో కనీసం 7గంటలు అరకొరగా విద్యుత్ అందేదని.. అయితే ఇప్పుడు అది కూడా అందడం లేదన్నారు. ప్రతి గంటకు రెండు మూడు సార్లు కోతలు విధిస్తుండటంతో మోటార్లు కాలిపోతున్నాయన్నారు. ఒక్క నెలలోనే సుమారు 50మోటార్లు కాలిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇంత జరుగుతున్నా రైతులను పరామర్శించడం కానీ పొలాలను పరిశీలించే వారు ఒక్కరైనా ఉన్నారా నిలదీశారు. అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పొలాల వైపు చూడలేదన్నారు. సీఎం జగన్ కు రైతుల కన్నీరు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యేలు మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు.లక్షల రూపాయలు పంటలు నష్టపోతున్న రైతులకు ఏం సమాధానం చెబుతారన్నారు. అసలే ఈ ఏడాది వర్షాలు లేక జనం అల్లాడిపోతున్నారని.. ఉన్న అరకొర నీటితో పంటలు పండించుకుంటే కనీసం కరెంటు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సీఎం జగన్ కు ఎంత సేపు చంద్రబాబుకి ఎలా బెయిల్ రాకుండా చేయాలన్న దాని మీద ఉన్న ధ్యాస.. రైతులపై లేదన్నారు. ఇప్పటికైనా 9గంటల విద్యుత్ ఇవ్వకపోతే.. ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సైతం వెనుకాడబోమన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement