Saturday, May 4, 2024

అమరావతే రాజధాని.. కేంద్ర సంస్థల నిర్మాణాలు చేపట్టాలి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర సంస్థల నిర్మాణాలు చేపట్టాలని అమరావతి రైతు జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. బిల్డ్ అమరావతి పేరుతో జేఏసీ నేతలు ఢిల్లీ పర్యటన చేపట్టారు. అమరావతి రాజధానిగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర పెద్దలకు వివరిస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మంగళవారం పలువురు కేంద్ర పెద్దలను కలిసి అమరావతిలో నిర్మాణాలు చేపట్టాలని వినతి పత్రాలు సమర్పించారు. అమరావతి జేఏసీ, మహిళా రైతులు బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని కలిశారు.

అమరావతికి శరద్ పవార్ మద్దతు..

మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ, జేఏసీ ప్రతినిధులు ఎన్సీపీ అధినేత శరద్ పవర్‌తో భేటీ మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ, జేఏసీ ప్రతినిధులు ఎన్సీపీ అధినేత శరద్ పవర్‌తో భేటీ అయ్యారు. రేణుకా చౌదరి ఆయనకు అమరావతి రైతుల సమస్యలను వివరించారు. ఏపీ హైకోర్టు అమరావతి రాజధాని అంశంలో ఇచ్చిన తీర్పును కూడా ఆమె శరద్ పవార్‌కు వివరించారు. రైతులు 820 రోజుల నుంచి రోడ్ల మీదే ఆందోళన చేస్తున్నారని రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ళుగా అమరావతిలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదని తెలిపారు. సీఎం జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం వెనుక కారణమేంటని శరద్ పవార్ అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు రాజధానికి మద్దతు ఇచ్చిన జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక హఠాత్తుగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని రైతులు వివరించారు. పార్లమెంట్‌లో ఏపీ రాజధాని అంశంపై తాము మద్దతిస్తామని శరద్ పవార్ వారికి హామీ ఇచ్చారు. రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మహారాష్ట్రకి రెండు రాజధానులుండడంతో నాగ్‌పూర్, విదర్భ అబివృద్ధికి నోచుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యసభలో తీర్మానం పెడితే వెంటనే చర్చలో పాల్గొని మద్దతునిస్తామన్నారు.

కొప్పుల రాజుతో బహుజన జేఏసీ భేటీ

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో అమరావతి బహుజన జేఏసీ నాయకులు బాలకోటయ్య, సుంకర పద్మశ్రీ, కంచర్ల గాంధీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల నేషనల్ కోఆర్డినేటర్ కొప్పుల రాజును కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ధ్వంసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వ చర్యలను, ఉద్యమంపై జరిగిన ప్రభుత్వ దాడిని బాలకోటయ్య కొప్పుల రాజుకు వివరించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు, మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలపై విచారణ చేపట్టేలా కేంద్ర ప్రభుత్వ సంస్థలను డిమాండ్ చేయాలని, పార్లమెంటులోనూ అమరావతి అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఇవ్వాలంటూ కొప్పుల రాజుకు రెండు వినతి పత్రాలు అందజేశారు. అమరావతి రైతులతో పాటు దళిత, బహుజన కులాలతో ఢిల్లీలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కొప్పుల రాజును సుంకర పద్మశ్రీ కోరారు.

- Advertisement -

సీఎం నివాసం వద్ద భారీ భద్రత..

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం అధికారిక నివాసం జన్‌పథ్ వద్ద సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీసులు మోహరించారు. అమరావతి జేఏసీ, రైతులు సీఎం నివాసం వద్ద ధర్నా చేస్తారన్న సమాచారంతో ఏపీ భవన్, సీఎం నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement