Sunday, April 28, 2024

విశాఖ‌కు రాజ‌ధాని క‌ళ‌..

ఇల్లు అద్దెకు చూడండి.. స్థానిక అధికారులకు ఆదేశాలు
ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాల ఎంపికలు
క్యాంపు కార్యాలయాల కోసం మంత్రుల హడావిడి
విశాఖలోనూ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, సీఎం నివాసం
అవసరమైతే అక్కడా ఇక్కడా సమావేశాలు, సమీక్షలు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో : విశాఖకు ఇప్పుడు ఎటు చూసినా రాజధాని హంగులే కనిపిస్తున్నాయి. పైకి పెద్దగా ఆర్బాటం లేకపోయినా ఏప్రిల్‌ నాటికి విశాఖ నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలన సాగిస్తారని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు అందుతుండడంతో ఉన్నతాధికార వర్గాలు ఆ దిశగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. భీమిలి బీచ్‌రోడ్డులో రాజధాని ఏర్పాటు కానుం దని ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి ఇటీవలే స్పష్టం చేశారు. తనతో పాటు పలువురు మంత్రులు రుషికొండ సమీపంలోని పనోరమ హిల్స్‌లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నామని ఇటీవలే రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పకనే చెప్పారు.

ఇక జిల్లా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రతీ సందర్భంలోనూ త్వరలో విశాఖ నుంచే పరిపాలన ప్రారంభం కానుందని స్పష్టం చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఆర్‌.కె. బీచ్‌రోడ్డులో రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి నేతృత్వంలో జీవీఎంసీకి చెందిన గెస్ట్‌ హౌస్‌ను పాలు పొంగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. అయితే ప్రస్తుతం జీ-20 సమావేశాల సెక్రటేరియట్‌గా ఉపయోగిస్తామని అధికారిక ప్రకటన చేసినప్పటికి భవిష్యత్తులో ఇదే కార్యాలయం రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలనా విభాగానికి దాన్ని ప్రధాన కార్యాలయంగా మార్పు చేస్తారని ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు. విశాఖ నుంచి ముఖ్యమంత్రి పరిపాలన ప్రారంభం కానుండడంతో ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాలు సిద్దమవుతున్నాయి. విశాఖలో అనేక ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాలు ఇందుకు సిద్దంగా ఉన్నాయి. ఏ విభాగానికీ లోటు లేకుండా అన్ని విభాగాలకు చెందిన ముఖ ్య కార్యాలయాలు ఇక్కడ ఉండనే ఉన్నాయి.
ఉన్నతాధికారులు కూడా తమకు అద్దెకు ఇల్లు చూడాలని దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. కొందరు అయితే చాలా కాలం క్రితమే ఇక్కడ అద్దెకు అపార్ట్‌మెంట్లు, వివిధ గృహసముదాయాలు తీసుకొని ఉంచుకోవడం జరిగింది. మంత్రులు సైతం క్యాంపు కార్యాలయాలు, తమ నివాసాలు ఏర్పాటు చేసుకునే ప్ర క్రియలో నిమగ్నమయ్యారు. అయితే పూర్తిస్థాయి రాజధాని ఏర్పాటులో కొంత మేర జాప్యం జరిగినప్పటికి ముఖ్యమంత్రి మాత్రం మార్చి 22న విశాఖ వేదికగా నూతన గృహప్రవేశం చేస్తారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయం మాదిరిగానే విశాఖలో కూడా ముఖ్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి ఇప ్పటి మాదిరిగానే సేమ్‌ టు సేమ్‌ తరహాలో రోజువారీగా విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్నది. అవసరమనుకుంటే అక్కడా, ఇక్కడా కూడా సమావేశాలు, సమీక్షలు, పరిపాలన పరమైన నిర్ణయాలు తీసుకుంటారని, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అయినా పాలన సాగించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేనివిధంగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని ఆయా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
విశాఖ వేదికగా మార్చి 28, 29 తేదీలలో జీ-20 సమావేశాలు జరగనున్నాయి.
రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు రుషికొండ సమీపంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా చేస్తున్నది. సుమారు రూ.130 కోట్లతో నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంతో పాటు అనేక ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ఒ ఏ.మల్లిఖార్జున ఇప్పటికే స్పష్టం చేశారు. విశాఖని మరోసారి అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఇక మార్చి 3, 4 తేదీల్లో ఆంధ్రాయూనివర్సిటి ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు దేశాలకు చెందిన వ్యాపార వేత్తలను, బడా సంస్థల యజమానులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. రాష్ట్ర భారీపరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఇటీవలే ఇందుకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement