Friday, May 3, 2024

గురుకులాల్లో సప్లిమెంటరీ విద్యార్థులకూ ప్రవేశం : మేరుగు నాగార్జున

అమరావతి, ఆంధ్రప్రభ : ఈ ఏడాది పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్లు ఇవ్వాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్లలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్‌ అయిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకూడదనే నిబంధన ఉన్నా దాన్ని ఈ ఏడాదికి సడలించి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి కూడా అడ్మిషన్లు ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన జిల్లా గురుకులాల సమన్వయకర్త (డీసీఓ)ల సమావేశంలో నాగార్జున గురుకులాల్లో ప్రవేశాలతొ పాటు పలు అంశాలను సమీక్షించారు. ఇంటర్‌ లో ఎంఇసి, సిఇసి కోర్సులను ఎంపీసీ, బైపీసీలుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్‌లో ప్రస్తుతం ఉన్న సీట్లు కాకుండా అదనపు సీట్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు . గురుకులాల్లో ఎక్కువగా డిమాండ్‌ లేని ఎంఇసి, సిఇసి సీట్లను ఎంపీసీ, బైపీసీలుగా మార్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని, గురుకులాల్లో గతంలో లేని విధంగా విద్యాప్రమాణాలను మెరుగుపర్చడానికి విద్యార్థులకు వారాంతపు పరీక్షలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.

డీసీవోలు గురుకులాలను నిరంతరం పర్యవేక్షిస్తూ మంచి ఫలితాలను సాధించేందకు కృషి చేయాలన్నారు. గురుకులాలకు సంబంధించిన హాస్టళ్లలో కేర్‌ టేకర్లు నివాసం ఉంటూ విద్యార్థుల అధ్యయనాన్ని పర్యవేక్షిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయని అభిప్రాయపడ్డారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఒక్క సీటు కూడా మిగిలిపోకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆలోచన అని మంత్రి నాగార్జున తెలిపారు. ఈ నేపథ్యంలోనే స్కూళ్ల స్థాయిలో సీట్లు ఖాళీ లేని పక్షంలో జిల్లా స్థాయిలో ఖాళీలను చూసుకొని వాటిని భర్తీ చేయడానికి చర్యలను తీసుకోవాలని సూచించారు. . గురుకులాలకు అవసరమైన లైబ్రేరియన్‌, ఎలక్ట్రీష్రియన్‌ ఖాళీలను జిల్లాల స్థాయిలో భర్తీ చేసుకోవడానికి కూడా చర్యలు చేపట్టాలని డిసీఓలను మంత్రి ఆదేశించారు. గురుకులాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి, కావాల్సిన నిధులను మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌ సిద్ధంగా ఉన్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని నాగార్జున పేర్కొన్నారు. సమావేశంలో గురుకులాల కార్యదర్శి పావనమూర్తి, డిప్యుటీ అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ మల్లేశ్వర్‌ రావు తో పాటు-గా వివిధ జిల్లాల నుంచి వచ్చిన డీసీవోలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement