Saturday, April 13, 2024

పొంగిన పాల ధర లీటరుకు రూ.2 పెంపు.. ప్రకటించిన అముల్‌, మదర్‌ డెయిరీలు

అమరావతి, ఆంధ్రప్రభ : పాల ధర పొంగింది.. ప్రజలపై మరో భారం పడింది. దేశవ్యాప్తంగా పాల ధరలను పెంచుతున్నట్టు- గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌)కు చెందిన అముల్‌ తో పాటు మదర్‌ డెయిరీ ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు ఏపీలోనూ విస్తృతంగా తమ కార్కకలాపాలను కొనసాగిస్తున్నాయి. పాల ధరను లీటరుకు 2 రూపాయలు పెంచుతున్నట్టు రెండు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఈనెల 17 బుధవారం నుంచే అమల్లోకి రానున్నట్టు కూడా వెల్లడించాయి. పెరిగిన ధరల ప్రకారం… అమూల్‌ గోల్డ్‌ మిల్క్‌ అర లీటరు ధర రూ.31కు చేరుకోనుంది. అమూల్‌ తాజా మిల్క్‌ ధర రూ.25, అమూల్‌ శక్తి పాల ప్యాకెట్‌ ధర రూ.28కు పెరగనుంది. మదర్‌ డెయిరీ ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌ ధర కూడా లీటరు రూ.61కి చేరుకోనుంది. డబుల్‌ టోన్డ్‌ మిల్క్‌ ధర లీటరు రూ.45, బల్క్‌ వెండెడ్‌ మిల్క్‌ (టోకెన్‌ మిల్క్‌) ధర లీటరు రూ.46 నుంచి రూ.48కు పెరగనుంది. లీటరు పాల ధరను రూ.2 లు పెంచటం వల్ల వాటి ఎంఆర్‌పీలో సుమారు 4 శాతం పెంచినట్టయింది. గడిచిన అయిదారు నెలలుగా తమ కంపెనీల నిర్వహణ, పాల ఉత్పత్తి వ్యయం 10 శాతంకు మించి పెరగటం వల్ల ధరలు పెంచక తప్పటం లేదని రెండు సంస్థలు ప్రకటించాయి. మదర్‌ డెయిరీ రాష్ట్రంలోని కొన్ని సహకార డెయిరీల్లో భాగస్వామ్యాన్ని పొంది తమ బ్రాండ్లతో పాలను విక్రయిస్తుండగా, అముల్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వంతోనే భాగస్వామ్య ఒప్పందం ఉంది.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. ఖాయిలా పడ్డ సహకార డెయిరీల నిర్వహణను అముల్‌కు అప్పగించటంతో పాటు పాలసేకరణ, ఉత్పత్తి తదితర కార్యకలాపాలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు, సబ్సిడీలు అందిస్తోంది. మదర్‌, అముల్‌ సంస్థలు ధరలు పెంచాక ఆ బాటలోనే రాష్ట్రంలోని స్థానిక సహకార, ప్రయివేట్‌ డెయిరీలు కూడా ధరలు పెంచటం ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చెప్పుకోతగిన మార్కెటింగ్‌ వాటా ఉన్న విజయ, సంగం తదితర డెయిరీలు కూడా త్వరలోనే తమ పాల ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement