Sunday, May 19, 2024

AP | అద్దంకి వైసీపీ సిద్దం సభ వాయిదా

తాడేపల్లి : సార్వ‌త్రిక ఎన్నికలకు కేడర్‌ను సమాయత్త‌పరిచే విధంగా సిద్ధం సభలు నిర్వహిస్తున్న వైసీపీ… తొలి సభను ఉత్తరాంధ్ర జిల్లాల కోసం విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో నిర్వ‌హించింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి దెందులూరు నియోజకవర్గంలో రెండో సభ జరిగింది. ఇక రాయలసీమ జిల్లాలకు సంబంధించి రాప్తాడులో మూడో సభను భారీ ఎత్తున నిర్వహించారు. ఇక‌, చివరిదైన నాలుగో సిద్ధం సభను బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్‌లో నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. రాప్తాడులో నిర్వహించిన సభ కంటే రెట్టింపు స్థాయిలో ఈ సభను నిర్వహించేందుకు వైసీపీ సన్నాహాలు చేస్తోంది.

అయితే, నాలుగో సిద్ధం సభ తేదీని మార్చింది వైసీపీ. అద్దంకి సిద్ధం సభ ఈ నెల 10న జరగాల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా వేశారు. దీంతో ఈ నెల 19న నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అద్దంకిలో నాల్గవ సభకు 15 లక్షల మంది త‌ర‌లించ‌డ‌మే వైసిపి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారణంగా, స‌భాస్థ‌లిని పెద్ద ఎత్తున పునర్నిర్మిస్తున్నారు. దాదాపు 500 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఈ సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరుకానున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఇదే చివరి సభ కావడంతో తుది సభకు క్యాడర్‌ను మరింత సన్నద్ధం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement