Thursday, May 16, 2024

నాటు సారా వృత్తికి చెక్.. ప్రత్యామ్నాయాలపై దృష్టి

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నాటుసారా తయారీ దారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించే సరికొత్త ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. నాటు సారా తయారీ దారులతోపాటు బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యం రవాణా, విక్రయాలను పూర్తిగా రూపుమాపాలన్నాది రాష్ట్ర ప్రభుత్వ కృత నిశ్చయం ఈ అంశంపై సీఎం ఆదేశాలు జారీ అయిన వెంటనే పోలీసుశాఖ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరోను దీనిపై దృష్టి సారించేలా డీజీపీ కెవి రాజేంద్ర నాధ్‌రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సూచించిన విధంగా రాష్ట్రంలో నాటుసారా తయారీదారులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పటికే సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు బెల్టుషాపులు, అక్రమ మద్యంపై కూడా ఇక నుంచి మరింత కఠినంగా ఎస్‌ఇబి వ్యవహరించనుంది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నాటు సారా తయారీ స్ధావరాలను ముందుగా గుర్తించడంతోపాటు దశాబ్ధాలుగా దీనిపైనే ఆధార పడి జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రాజెక్టు రెడీ అవుతోంది.

నవోదయకు కొత్త రూపం..?

రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని పోలీసు యూనిట్ల ద్వారా పక్కా కార్యాచరణతో ఒక యూనిట్‌కు ఒక ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో నాటు-సారా కట్టడికి ‘నవోదయం’ పధకం అమలవు తోంది. సీఎం తాజా ఆదేశాలతో నవోదయం పధకానికి కొత్త రూపం ఇస్తూ వినూత్నంగా చేయాలనే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన నవోదయం అమలుకు గతంలోనే ఇన్‌ఫార్మర్‌ వ్యవస్ధను పటిష్టం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా నాటు- సారా తయారీ కేంద్రాల సమాచారం సేకరించడం జరిగింది. దాదాపు 700పైగా నాటు-సారా తయారీ కేంద్రాలు ఉండగా, 150 వరకు అధికంగా తయారు చేసేవి, 300 వరకు సెకండ్‌ కేటగిరి, 350కి పైగా తక్కువ మోతాదులో తయారీ కేంద్రాలుగా గుర్తించారు. మొత్తం మీదట రాష్ట్రంలో రోజుకు 1000 నుంచి రెండు వేల లీటర్ల నాటు సారా తయారవుతుందని అంచనా. శ్రీకాకుళం, విజయనగరం కొండ ప్రాంతాలు, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల ఏజెన్సీ ప్రాం తాలు, గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు, తండాలు, అదే విధంగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం వంటి జిల్లాల్లో నాటు సారా అధికంగా తయారు చేస్తున్నట్లు ఇటీవల పోలీసుల దాడులే చెబుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement