Friday, May 3, 2024

Delhi: విద్యలో వెనుకబడ్డ 7 జిల్లాలకు 317 కోట్ల నిధులు.. విజయసాయి ప్రశ్నలకు కేంద్రం బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉన్నత విద్యా రంగంలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో మోడల్‌ డిగ్రీ కాలేజీల ఏర్పాటు, కాలేజీలు, యూనివర్శిటీల్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం 317 కోట్ల రూపాయలు గ్రాంట్‌ కింద విడుదలకు ఆమోదం తెలిపిందని విద్యా శాఖ సహాయ మంత్రి సుభాస్‌ సర్కార్‌ తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో 374 జిల్లాలు విద్యాపరంగా వెనుకబడినట్లుగా యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నియమించిన నిపుణుల సంఘం గుర్తించిందని చెప్పారు.

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఉన్నాయి. విద్యాపరంగా వెనుకబడిన ఈ జిల్లాల్లో విద్యార్ధుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) జాతీయ సగటు అయిన 12.4 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు యూజీసీ నిపుణుల సంఘం నిర్ధారించినట్లు మంత్రి తెలిపారు. విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని గుర్తించిన మీదట అనేక పథకాలను అమలు చేయడం ప్రారంభించినట్లు మంత్రి సర్కార్‌ పేర్కొన్నారు.

అందులో భాగంగా ఉన్నత విద్యను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసురావడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా)ను ప్రారంభించింది. ఈ పథకం కింద విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం మోడల్‌ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు, కాలేజీలు, యూనివర్శిటీలలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను గ్రాంట్‌గా మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో విద్యాపరంగా వెనుకబడినట్లుగా గుర్తించిన ఏడు జిల్లాల్లో ఉన్నత విద్యావకాశాలు మెరుగుపరచడానికి 317 కోట్ల రూపాయలను చేస్తూ రూసా (ప్రాజెక్ట్ ఆమోదం బోర్డు) నిర్ణయించిందని ఆయన చెప్పారు.

పౌష్టికాహారలోపం నివారణే పోషణ్‌ అభియాన్‌ లక్ష్యం
చిన్నారులు, యుక్తవయసు బాలికలు, గర్భిణులు, బాలింతలు ఎదుర్కొంటున్న పౌష్టకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా సాక్షం అంగన్‌వాడీ, పోషన్‌ 2.0 పథకాలను తీసుకువచ్చినట్లు రాజ్యసభలో బుధవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మహిళా, శిశు అభివృద్ధి మంత్రి జవాబిచ్చారు. పౌష్టికాహారలోపం దేశం ఎదుర్కొంటున్న పలు ఆరోగ్య సమస్యలలో ఒకటి. దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొని ఉత్తమ ఫలితాలను రాబట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం 2018లో పోషణ్‌ అభియాన్‌ను ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. ఆరేళ్ళలోపు పిల్లల్లో ఎదుగుదల, బరువు, రక్తహీనత లోపాల నివారణను 2 నుంచి 3 శాతం తగ్గించడం లక్ష్యంగా సాక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 అభియాన్‌ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20 ఫలితాల ప్రకారం ఐదేళ్ళలోపు చిన్నారులలో పౌష్టికాహారలోపం, అండర్‌వెయిట్‌ 38 శాతం నుంచి 34 శాతానికి తగ్గినట్లుగా గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement