Thursday, April 25, 2024

Post Martum: 20 వేలే కార‌ణ‌మా.. ఇల్లీగ‌ల్ ఇష్యూ ఉందా? డ్రైవ‌ర్ మ‌ర్డ‌ర్ కేసులో అన్నీ ప్రశ్నలే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు మాజీ డ్రైవర్ హత్య కేసు ఇప్పుడు బాగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఈ ఘటన జరిగిన ఐదు, ఆరు రోజుల‌వుతున్నా అంద‌రినోటా ఇదే మాట వినిపిస్తోంది. ఇంత‌కీ.. డ్రైవ‌ర్‌ను ఎందుకు చంపేశారు. 20వేల రూపాయ‌లే కార‌ణ‌మా? లేక మ‌రేదైనా ఇల్లీగ‌ల్ ఇష్యూ ఉందా… ప్రాణాలు తీసేంత త‌ప్పు డ్రైవ‌ర్ ఏం చేశాడు? అనేదే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీస్తోంది. కాగా, ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే చంపేశానని అనంతబాబు అంగీకరించారని పోలీసులు చెప్పారు. రెండు రోజుల పాటు ఎమ్మెల్సీని తమ అదుపులోనే ఉంచుకున్న పోలీసులు.. అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో సోమవారం రాత్రి అధికారికంగా అరెస్టును ప్రకటించారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ రవీంద్రబాబు వివరించారు.

ఇక‌.. జిల్లా ఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి సుబ్రహ్మణ్యం మందు తాగాడు. ఆ సమయంలోనే అటుగా వస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు.. అతడిని తన కారులో తీసుకుని వెళ్లాడు. తర్వాత ఇద్దరు కలిసి జన్మభూమి పార్క్ ఏరియాలో టిఫిన్ చేశారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య డబ్బుల కోసం గొడవ జరిగింది. సుబ్రహ్మణ్యం పెళ్లి సమయంలో ఎమ్మెల్సీ కొంత డబ్బు ఇచ్చాడు. అందులో ఇంకా 20 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఆ ఆ డబ్బు అడగడటంతో పాటు ప్రవర్తన మార్చుకోవాలని డ్రైవర్ ను ఎమ్మెల్సీ బెదిరించాడు. దీంతో సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీతో వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో తనకే ఎదురు చెబుతావా అంటూ అనంతబాబు.. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వెనక్కి నెట్టేశాడు. దీంతో పక్కనే ఉన్న దిమ్మతగిలి గాయపడ్డాడు. మరోసారి నెట్టేయడంతో అక్కడ గేటుకు ఉన్న ఐరన్ చువ్వలు సుబ్రహ్మణ్యాన్ని గుచ్చుకున్నాయి. దీంతో తీవ్ర గాయాలైనే డ్రైవర్ ను ఎమ్మెల్సీ అనంతబాబు. తన కారులో తీసుకుని వెళ్లాడు.

కాసేపటికి సుబ్రహ్మణ్యాన్ని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడని గుర్తించాడు. దీంతో మరో ప్లాన్ చేశాడు అనంతబాబు. గతంలో సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదాలు చేశాడు. దీంతో అతని హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఎమ్మెల్సీ అనంతబాబు. కాకినాడ డంపింగ్‌ యార్డు వద్దకు తీసుకెళ్లి.. డెడ్ బాడీని కిందకు దించి.. ఇటుకలు, కర్రతో తీవ్రంగా కొట్టాడు. రోడ్డు ప్రమాదంలో గాయాలు అయ్యాయని అందరిని నమ్మించటానికే అనంతబాబు అలా చేశాడని జిల్లా ఎస్పీ రవీంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్సీ చేసిన హత్య ఘటనకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పారంటూ.. పోలీసులు చెప్పిన వివరాలపై అనేక అనుమానాలు వస్తున్నాయి.

హత్యకు అసలు కారణం చెప్పకుండా పోలీసులు దాచిపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. 20 వేల రూపాయల కోసం ఎమ్మెల్సీ.. ఒక వ్యక్తిని చంపేశాడ‌ని చెప్పడమే చాలా సిల్లీగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఊళ్లో ఉండే సర్పంచులు, చిన్న చిన్న లీడ‌ర్లు కూడా ఎంతో హంగామా చేస్తుంటారు. గ్రామంలో ఎవరి పెళ్లి జరిగినా డబ్బులు సాయం చేస్తుంటారు. తమ సొంత మనుషులకు అయితే ఇంకా ఎక్కువగా ఇస్తారు. అలాంటిది ఒక ఎమ్మెల్సీ అదికూడా ఆర్థికంగా బలంగా ఉన్న నేత.. తన కారు డ్రైవర్ పెళ్లికి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని గొడవ పెట్టుకుంటారా? అన్నది నమ్మశక్యం అనిపించడం లేదని చాలామంది బ‌హిరంగంగానే అంటున్నారు.

అది కూడా కేవలం 20 వేల కోసం ఏకంగా ఎమ్మెల్సీనే స్వయంగా హత్యకు పాల్పడుతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక‌.. ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబుకు ప్రభుత్వం ఇద్దరు గన్ మెన్లను కేటాయించింది. సెక్యూరిటీ లేకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎక్కడికి వెళ్లరు. అలాంటిది రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము వరకు తన గన్ మెన్లు లేకుండా ఎమ్మెల్సీ ఒక్కడే ఎలా తిరిగారన్నది అంతుచిక్కడం లేదు. తమకు తెలియకుండా నేతలు వెళ్లినా.. వెంటనే ఉన్నతాధికారులకు గన్ మెన్లు సమాచారం ఇస్తారు. మరి అనంతబాబు దాదాపు 8 గంటల పాటు ఒక్కడే బయట తిరుగుతున్నా.. ఎందుకు చెప్పలేదనేది కూడా ఇక్క‌డ మ‌రో కీల‌క‌మైన అంశంగా ఉంది.

- Advertisement -

అయితే.. ఈ విషయంపై ఎస్పీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ప్రజాప్రతినిధులు మాములుగా ఒంటరిగా ఎక్కడికి వెళ్లరు. కానీ, అనంతబాబు కారులో ఒక్కడే ఎందుకు వెళ్లారన్నదానిపైనా పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఎమ్మెల్సీ తమ ఇంటికి వచ్చాడరని హతుడి తల్లి చెబుతోంది. కానీ, పోలీసులు మాత్రం రోడ్డుపై కనిపిస్తే అనంతబాబు తీసుకెళ్లాడ‌ని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని లిక్కర్ తాగాడని పోలీసులు చెప్పారు. కానీ, పోస్ట్ మార్టమ్ నివేదికలో మందు తాగినట్లు లేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగా అనుకోకుండా నెట్టేయడంతో సుబ్రహ్మణ్యం చనిపోయడాని చెప్పడాన్ని కూడా కొంత‌మంది తప్పుపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్సీ హత్య చేయలేదంటూ.. కేసును కొంత బలహీనం చేసే యత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇక.. సుబ్రహ్మణ్యం శరీరంపై ఉన్న గాయాలు హత్యకు ముందు జరిగినవా.. లేక పోలీసులు చెబుతున్నట్లు చనిపోయాక కొట్టిన గాయాలా అన్నది కూడా తేలలేదు. పోలీసులు ఈ విషయంలోనూ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో పోలీసులు ఏదో దాచిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇల్లీగ‌ల్ ఇష్యూ అయితేనే ఇంత‌టి సీరియ‌స్ నెస్ ఉంటుంద‌ని, ఈ మ‌ర్డ‌ర్ విష‌యంలో ఏదో దాస్తున్నార‌ని.. అధికారం ముసుగులో ఏం చేసినా చెల్లుతుంద‌నే దానికి ఎమ్మెల్సీతో పాటు.. పోలీసుల తీరు కూడా ఈ కేసులో నిద‌ర్శ‌నంగా మారుతుంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement