Thursday, April 25, 2024

2.90 లక్షల కోట్ల బడ్జెట్‌ అంచనా

అమరావతి, ఆంధ్రప్రభ: 2023-24లో బడ్జెట్‌ అంచనా రూ.2.90 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పెట్టే చివరి బడ్జెట్‌ కావడంతో ఈ బడ్జెట్‌ కాస్తంత భారీగా పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఖజానాకు వచ్చే ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో రూ.1.65 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది ఒక్క మార్చి నెలలోనే ఖజానాకు రూ.24,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కలిపి ఖజానాకు మరో రూ.35,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీని ఆధారంగా వచ్చే ఏడాది ఆదాయం ఇంకో రూ.15,000 కోట్లు పెరగొచ్చని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో బడ్జెట్‌ను రూ.2.90 లక్షల కోట్ల వరకు పెట్టు కోవచ్చని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే సంక్షేమ రంగానికి మరింతగా కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమంతోపాటు అన్ని రంగాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోందని అధికార పక్ష సభ్యులు ఇప్పటికే ప్రకటనలు గుప్పిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం సమతుల్యతతో అన్ని వర్గాలకు అండగా నిలిచే విధంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. పేదరికాన్ని జయించడమే చాలా సమస్యలకు పరిష్కారానికి సరైన మార్గమని, ఆదిశగా బడ్జెట్‌రూపకల్పన, నిధుల కేటాయింపు జరిగేలా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే లక్ష్య సాధనకు ఇంజన్‌లా పనిచేస్తున్న ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, సామాజిక భద్రత అంశాలకు బడ్జెట్‌లో సమ ప్రాధాన్యతను ఇవ్వాని ఆయన అధికారులను ఆదేశించారు. వివిధ సంక్షేమపథకాలు, కార్యక్రమాల అమలు వెనుక ఉన్న మూలాధార సూత్రాన్ని బడ్జెట్‌లో ప్రతిబింబించాలని ఆయన పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

ఈక్రమంలోనే 2023-24ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుందని అధికారుల, ప్రభుత్వ పెద్దలుచెబుతున్నారు.గత ఏడాది మహిళల అభివృద్ధికి రూ. 55,015.20 కోట్లు కేటాయించారని, ఈసారి ఈమొత్తాన్ని 60 వేల కోట్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. పిల్లలు, చిన్నారుల కోసం గత ఏడాది రూ. 16,903.17 కోట్లు కేటాయించగా ఈసారి అది రూ.20 వేల కోట్లకు పెరిగే అవకాశముంది. వైయస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.18 వేల కోట్లు గత బడ్జెట్‌లో కేటాయించగా ఈసారి అది రూ.25 వేల కోట్లకు పెరగనుందని అంటున్నారు. ఇక రైతు సంక్షేమానికి గత బడ్జెట్‌లో రూ.43,052 కోట్లు కేటాయించగా ఈసారి అది రూ.50 వేల కోట్ల వరకూ ఉండే అవకాశముందని అంటున్నారు.

వైయస్సార్‌ ఆసరా రూ.6,400కోట్ల నుండి రూ.7 వేల కోట్లకు, వైయస్సార్‌ఒ చేయూత రూ.4,235.95 కోట్ల నుండి రూ.4,600 కోట్లకు, వైయస్సార్‌ అమ్మ ఒడి రూ.6,500 కోట్ల నుండి రూ.7 వేల కోట్లకు, సాగు నీటి ప్రాజెక్టులకోసం రూ.11,482 కోట్ల నుండి రూ.12 వేల కోట్ల వరకూ, ఎస్సీ ఉపప్రణాళికకు రూ.18,518 కోట్ల నుండి రూ.19 వేలకోట్ల వరకూ, ఎస్టీ ఉప ప్రణాళిక రూ.6, 145 కోట్ల నుండి రూ.6,500 కోట్లకు, బీసీ ఉపప్రణాళిక రూ.29,143 కోట్ల నుండి రూ.30 వేల కోట్లకు , మైనార్టీ ఉప ప్రణాళిక రూ.3,662 కోట్ల నుండి రూ.4 వేల కోట్లకు పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఇక కాపుల సంక్షేమానికి కూడా 3,532 కోట్ల నుండి రూ.4 వేల కోట్లకు పెంచే అవకాశముందని తెలుస్తోంది. అలాగే ఈబీసీల సంక్షేమం కోసం రూ.6,669 కోల నుండి రూ.7 వేల కోట్లకు పెరగనుందని అంచనా. విద్యా రంగానికి రూ.30,077.20 కోట్ల నుండి రూ.32 వేల కోట్ల వరకూ కేటాయిస్తారని అంటున్నారు. ఇక ఆరోగ్య రంగానికి రూ.15,384 కోట్ల నుండి రూ.16 వేల కోట్లకు, పాఠశాలల్లో నాడు-నేడు కింద రూ.3,500 కోట్ల నుండి రూ.4 వేల కోట్లకు పెరగనుందని సమాచారం. అదేవిధంగా ఆస్పత్రుల్లో నాడు-నేడు కు రూ.2,848 కోట్ల నుండి రూ.3 వేల కోట్లకు, పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ.5 వేల కోట్ల వరకూ కేటాయిస్తారని సమాచారం. నాడు-నేడు ద్వారా పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్‌ వాడీలు, మార్కెట్‌ యార్డులు ఇలా అనేక రంగాల్లో భవనాల రూపు రేఖలు మారిపోతున్నాయి. దీనికింద ప్రభుత్వ భవనాలను మరింతగా అభివృద్ధి చేసే క్రమలో భవన నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని చెబుతున్నారు. ఈనేపథ్యంలో సామాన్య మానవుడు రాష్ట్ర బడ్జెట్‌ తమకెంతగా లాభిస్తుందోఅన్నదానిపై ఆత్రుతగా వేచి చూస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement