Thursday, March 23, 2023

మీకో రూల్-మందికి మరో రూలా? ఎమ్మెల్సీ కవితకు ఎంపీ అరవింద్ కౌంటర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఎమ్మెల్యేల కేసులో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్న కేటీఆర్, మరి తన చెల్లెలు కవితను సుప్రీంకోర్టుకు ఎందుకు పంపారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. మీకో రూల్, మందికో రూలా అంటూ నిలదీశారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కోర్టుకు వెళ్ళడం ప్రజల హక్కు అన్న ఆయన, దాన్ని ప్రశ్నిస్తే మీరే తప్పులో పడతారంటూ హితవు పలికారు. కవిత వెంట ఢిల్లీ వచ్చే నేతలు తాము కెమెరాలతో రికార్డ్ అవుతామన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హయత్ హోటల్‌కి వెళ్లినట్టు, దుబాయ్‌లో తిరిగినట్టు బయటపడ్డట్టు మీ కదలికలపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల రికార్డింగ్ మొదలవుతుందని అరవింద్ హెచ్చరించారు.

- Advertisement -
   

మీ జాతకాలు, చిట్టా అంతా దర్యాప్తు సంస్థలు లాగుతాయని ఆయన బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకోండి… కాదు, కూడదంటే మంత్రుల చిట్టా మొత్తం బయటకు వస్తుందని జోస్యం చెప్పారు. మహిళలకు సమానత్వం కోరుతున్న కవిత ఇప్పుడు ఒక మహిళగా తనను ప్రత్యేకంగా చూడాలని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. అసలింతకీ కవితకు ఏం కావాలని అరవింద్ ఎద్దేవా చేశారు. ఓవైపు లింగ వివక్ష ఉండవద్దని కోరుతున్న కవిత, కేసులో మాత్రం జెండర్‌ను ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. ఏదైనా ముందు మీ కుటుంబం నుంచి మొదలు పెట్టండి, 33 శాతం రిజ్వేషన్లు మీ ఇంట్లో, పార్టీలో అమలు చేసి బయటికొచ్చి మాట్లాడాలని అరవింద్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement