Wednesday, April 17, 2024

అంగన్వాడీలకు అద్దె కష్టాలు.. నిలిచిన అద్దె బిల్లుల చెల్లింపులు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను అద్దె కష్టాలు వెన్నాడుతున్నాయి. చిన్నారులు, బాలింతలు, గర్భిణీల కోసం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పుడు అద్దెల భారంతో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో అధిక శాతం అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్న పరిస్ధితి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు వుండగా వీటిలో 23,510 కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న పరిస్థితి వుంది. కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అవి ఇంతవరకూ పూర్తి కాలేదు. గడిచిన మూడున్నరేళ్ళుగా కేంద్రాలు నిర్మాణాలు పూర్తి స్దాయిలో జరగని పరిస్దితి నెలకొంది. కొన్ని భవనాలు పూర్తయినా ఇంకా వివిధ పనులు మిగిలి ఉండటంతో అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం నుంచి నిధులు పూర్తి స్దాయిలో అందకపోవడంతో అనేక జిల్లాల్లో కొత్త భవనాల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో అంగన్వాడీలకు అద్దె కష్టాలు తప్పని పరిస్ధితి నెలకొంది. ఇదే సమయంలో ప్రభుత్వంపై కూడా ఆర్దిక భారం పడుతూనే ఉంది. ఈ నేపధ్యంలో అద్దె బకాయిల చెల్లింపులు నెలల తరబడి పెండింగ్‌ లోనే ఉంటున్నాయి.

అద్దె కేంద్రాల బకాయిలు పేరుకుపోవడంతో యజమానుల ఒత్తిడి వర్కర్లపై రోజురోజుకూ పెరుగుతూ వస్తుండటంతో వారు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. బకాయిల కోసం అంగన్వాడీ వర్కర్లు సీడీపీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. మరోవైపు ఇటీ-వల ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల అద్దెలు పెంచుతూ నిర్ణయం తీసుకుని, ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఈ నిర్ణయం అంగన్వాడీలలో కొత్త ఆశలను నింపింది. అయితే తర్వాత నుంచి పాత అద్దెలకు సంబంధించి కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో తీవ్ర అవస్ధలు ఎదుర్కొంటున్నారు. కొత్త అద్దెలు రాకపోగా పాత బకాయిలు నిలిచిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమానుల ఒత్తిడిని తట్టుకోలేక కొంత మంది అంగన్వాడీ కార్యకర్తలు తమ సొంత సొమ్ములతో అద్దెలు కడుతున్నారు. ఇంకొంతమంది స్దానిక నేతల సహకారంతో యజమానుల ఒత్తిడినించి బయటపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 25 లక్షల మంది పైగా చిన్నారులు , 16 లక్షలకు పైగా బాలింతలు, గర్భిణీలు పోషణ పధకాలను పొందుతున్నారు.

- Advertisement -

వీరి కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. మధ్యాహ్న భోజన పధకం నుంచి పాలు, గుడ్లు , ఇతర పోషక ఆహారాన్ని అందిస్తోంది. అద్దె బకాయిలు సరైన సమయంలో అందకపోవడంతో కొందరు అంగన్వాడీలు ఈ పోషకాలను పక్క దారి పట్టిస్తూ తమ ఆర్దిక అవసరాలను తీర్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకోవైపు ప్రధాన నగరాల్లో అద్దెలు అకాశాన ంటుతున్నాయి. ఇది కూడా అంగన్వాడీలకు పెనుభారంగా మారింది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో పట్టణాల్లో అద్దెలు భారీగా ఉండడంతో ఉద్యోగుల జీతాలన్నీ అద్దెలకే పోతున్నాయని యూనియన్‌ నాయకులు వాపోతున్నారు. నగరాల్లో అద్దెలు కనీసం రూ.8వేల నుంచి రూ10 వేల వరకూ ఉంటున్నాయని ప్రభుత్వం కొత్తగా అద్దెలు పెంచినా మిగిలిన భారం అంగన్వాడీ వర్కర్లే మోయాల్సిన పరిస్దితి నెలకొందని చెబుతున్నారు. వాస్తవంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది . ఈ పరిస్ధితుల్లో గడిచిన మూడు నెలలుగా బకాయిలు రాకపోవడంతో ఇంకా ఆర్దిక కష్టాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకూ అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన అద్దె బకాయిలను విడుదల చేయలేదని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో డిసెంబర్‌ కు సంబంధించి నిధులు వచ్చినా చెల్లింపులు మాత్రం పూర్తి స్దాయిలో జరగలేదని ఆరోపిస్తున్నారు.

దీంతో ఉద్యోగులు తమ జీతాల నుంచే అద్దె బకాయిలు చెల్లించాల్సి వస్తోందని తమకు వచ్చే కొద్ది పాటి జీతం అద్దెలకే సరిపోతుందని ఆవేదనకు లోనవుతున్నారు.తమకు వచ్చే రూ.11,500 జీతంలో రూ.6 వేల నుంచి రూ. 8 వేలు అద్దె కిందే చెల్లించాల్సి వస్తోందని వర్కర్లు వాపోతున్నారు. దీనికి తోడు నెలవారీ కరెంటు- బిల్లు, గ్యాసు బిల్లుల భారం కూడా తమపైనే పడుతుందని ఇక ఈ భారాన్ని మోయలేమని చేతులెత్తేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను గుర్తించి అద్దె బకాయిల విడుదలకు అధికార యంత్రాంగానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అమలుకు నోచుకోని అద్దె పెంపు..

గత ఏడాది డిసెంబరు నుంచి అంగన్‌వాడీ కేంద్రాల అద్దె పెంచుతున్నట్లు- ప్రభుత్వం నవంబరులో ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో రూ.4 వేల అద్దెను రూ.6 వేలకు, గ్రామీణప్రాంతాల్లో వెయ్యి నుంచి రూ.2 వేలకు, గిరిజన ప్రాంతాల్లో రూ.500 నుంచి వెయ్యికి పెంచుతున్నట్లు- ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే ఈ ఉత్తర్వులు ఇంకా అమలుకు నోచుకోని పరిస్దితి కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో డిసెంబర్‌ నెల చెల్లింపులు పెరిగినా పాత రేట్ల ప్రకారమే జరిగినట్లుగా అంగన్వాడీలు చెబుతున్నారు. అనేక జిల్లాల్లో పాత అద్దె ధరలు చెల్లిస్తున్నారన్న ఆరోణలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement