Friday, May 3, 2024

తెలుగు రాష్ట్రాల సీఎంల తీరుతో నష్టం.. కేంద్రానికి బండి సంజయ్ లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రానికి లేఖ రాశారు. సీఎం కేసీఆర్ వైఖరి కారణంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణ తీవ్రంగా నష్టపోతోందంటూ కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు రాసిన లేఖలో ఆరోపించారు. కృష్ణా రివర్ బోర్డు పరిధిని ఖరారు చేయడం ద్వారా తెలంగాణ చట్టబద్ధమైన హక్కుల్ని కాపాడాలని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరూ చేతులు కలిపి నదీ జలాల అంశాలను వివాదం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టిన కేసీఆర్ ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగానికి కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుల్ని ఏర్పాటు చేయాల్సి ఉందని, అయితే వీటి పరిధిని కేంద్రం ఇప్పటి వరకు నోటిఫై చేయలేదని బండి సంజయ్ తెలిపారు.

రాష్ట్ర విభజన తర్వాత 811 టీఎంసీల నీటిని వాడుకునే ఏర్పాటు జరిగిందని, కానీ కేవలం 299 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అంగీకరించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ దారుణంగా దెబ్బతీశారని పేర్కొన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉందని, దీనిని బట్టి తెలంగాణకు 555 టీఎంసీల నీళ్లు దక్కాలన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా, ఉన్న దానిని విస్తరించాలన్నా అపెక్స్ కౌన్సిల్, కృష్ణాబోర్డు ఆమోదం తప్పనిసరి అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కి రాయలసీమ, పోతిరెడ్డి ప్రాజెక్టులను చేపట్టిందని ఆరోపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు అపెక్స్ కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: నీటి వివాదంపై.. ప్రధాని మోదీని కలవనున్న సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement