Thursday, April 25, 2024

మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగాలి… న్యాయమూర్తి అబ్దుల్ రఫీ

నారాయణపేట, మార్చి 6 (ప్రభ న్యూస్): మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగాలని నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ రఫీ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ రఫీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. మహిళల పట్ల జరుగుతున్న అనేక గృహహింస, భర్త వేధింపులు వరకట్న వేధింపులు వల్ల మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటి వల్ల స్త్రీలు మనోవేదనకు గురవుతున్నారన్నారు. అలాంటప్పుడు స్త్రీలు మనోధైర్యాన్ని కూడగట్టుకుని ముందడుగు వేయాలని సూచించారు. భర్త వల్ల వేధింపులు ఎక్కువైతే కోర్టు ద్వారా విడాకులు పొందవచ్చని, విడాకులు పొందిన తర్వాత భర్త కట్టించిన ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవచ్చన్నారు.

తండ్రి ఆస్తిలో మహిళలకు సమాన హక్కును సుప్రీంకోర్టు కల్పించిందని, ఆస్తిలో 50% వాటా ఇవ్వాలని, స్త్రీలను ప్రతీ విషయంలో సమానంగా చూడాలని 1975 సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా నిర్వహించడం జరిగిందన్నారు. సామాజికంగా, రాజకీయంగా మహిళలు పురుషులతో చైతన్యవంతులుగా, సమానంగా అన్నిరంగాల్లో ముందున్నారన్నారు. పెళ్లయిన మహిళలకు అన్నదమ్ముల ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ప్రతి పిల్లలకు మొదటి గురువు తల్లి అని ఆయన తెలిపారు. 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోతున్నారని, ఇలాంటి విషయంలో తల్లిదండ్రులు అమ్మాయిలకు తగిన జాగ్రత్తలు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జెడ్జ్ మహ్మద్ ఉమర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జకియ సుల్తానా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్, రాజ్ కుమార్, సిడబ్ల్యుసి రాధా, ఆశా వర్కర్లు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement