Friday, May 17, 2024

ఆ ఫొటోలు ఎందుకు షేర్ చేశారు? మ‌రో న‌లుగురిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో ఇప్పటికే ఒక మేజర్‌తో పాటు అయిదుగురు మైనర్లను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. లైంగిక దాడి ఘటనలో బాధితురాలితో పాటు ఒకరు మినహా మిగతా ఐదుగురు మైనర్లు కావడంతో వారి పేర్లు, కుటుంబ వివరాలు, ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయితే మైనర్లతో పాటు అత్యాచారానికి గురైన బాలిక వివరాలు బయట పెట్టవద్ద‌ని, అలా చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. పోలీసులు తీవ్రమైన హెచ్చరికలు చేసినా బాధిత బాలిక ఫొటోలు, వీడియోలు, మైనర్‌ నిందితుల విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. దీంతో సోషల్‌ మీడియాలో అదే పనిగా ఫొటోలు, వీడియోలు పెడుతున్న వారిపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసి వారి ఐపీ ఆధారంగా నలుగురిని గుర్తించారు. వారిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇకనుంచి అత్యాచారం కేసులో బాధితురాలి వివరాలు, నిందితుల సమాచారం బయటపెడితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో అత్యాచారానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్టు చేసి ఉంటే వాటిని వెంటనే తొలగించాలని పోలీసులు ఆదేశిస్తున్నారు. ఇదే అంశంపై ఫేస్‌బుక్‌, లీగల్‌ సెల్‌కు కూడా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు లేఖ రాసినట్టు సమాచారం. ఇప్పటికే అత్యాచారానికి సంబంధించిన సమాచారాన్ని, ఫోటోలను, వీడియోను మీడియా సమావేశంలో బయటపెట్టిన బాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై ఆబిడ్స పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. న్యాయవాది కొమ్మారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రఘునందర్‌పై కేసు పెట్టారు. రఘునందన్‌రావుకు ఫోటోలు, వీడియోలు ఎలా చేరాయన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రఘునందన్‌రావుపై కేసు పెట్టినా ఇంత వరకు పోలీసులు ఆయనను విచారణకు పిలవలేదు. అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ను కోర్టు ఉత్తర్వులతో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆయనను రెండోరోజు విచారించారు.

విచారణకు ప్రత్యేక కోర్టు
జూబ్లిహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసును త్వరితగతిన విచారించి నిందితులకు కఠిన శిక్ష పడేందుకు వీలుగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటుకు సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నట్టు సమాచారం. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని నందిగామ ప్రాంతంలో రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న దిశ ఎన్‌కౌంటర్‌ విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు తరహాలోనే జూబ్లిహిల్స్‌ అత్యాచార ఘటన కేసులో త్వరితగతిన నిందితులకు శిక్ష పడేలా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసి తద్వారా బాధిత బాలికకు న్యాయం చేయాలని, అత్యాచారానికి ఒడిగట్టిన మైనర్లతో పాటు మేజర్‌కు శిక్ష పడేలా చేసి భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement