Thursday, May 2, 2024

బీసీలకిచ్చిన హామీ ఏమాయె..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ మాదిరిగానే బీసీలకు సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామన్న ప్రభుత్వ హామీ ఇంకా నెరవేరడం లేదు. నాలుగేళ్ల క్రితం బీసీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో బీసీల సమస్యలపై మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమోదించిన 210 తీర్మానాలు అటకెక్కాయి. విద్య, వైద్యం, సామాజిక, రాజకీయ రిజర్వేషన్లు, ఉపాధి తదితర రంగాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులోనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ లెక్కనే బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ కూడా అసెంబ్లిలో బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చిన అంశాన్ని బీసీ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. సబ్‌ప్లాన్‌ నిధులు వస్తే బాగుపడుతామనుకున్న బీసీ యువత ఆశలు ఆవిరైనాయి.

ఏటా బడ్జెట్‌లో కేటాయించే నిధులు ప్రభుత్వం తగ్గిస్తోందనే విమర్శలు బీసీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. స్వయం ఉపాధి కోసం చేసుకున్న 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లోనే మూలుగుతున్న పరిస్థితి ఏర్పడింది. నిధుల విడుదలతో జాప్యం కారణంగా బీసీల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకాలు అమలుకాకపోవడం.. బీసీ కుల వృత్తులను కూడా పట్టించుకోవడం లేదంటున్నారు. వీటితో పాటు బీసీ ఫెడరేషన్లు, కార్పోరేషన్లను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనే అపవాదును ప్రభుత్వం మూటగట్టుకోవాల్సి వస్తోంది. నాయీ బ్రాహ్మణులకు మోడ్రన్‌ హెయిర్‌ సెలూన్స్‌, రజకులకు గ్రామాల్లో నిర్మాణాలు డయింగ్‌ మిషన్ల పంపిణితో పాటు నేతలన్నలకిచ్చిన హామీలను అమలు చేయాలని ఆయా వర్గాలకు చెందిన నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

బీసీల్లోని ఆర్థికంగా మరింత వెనుకబడిన కులాలకు ఫెడరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో నాయీబ్రాహ్మణ, రజక, వడ్డెర, కృష్ణ బలిజ పూసల, వాల్మీకి/ బోయ, బట్రాజు, మేదర, విశ్వబ్రాహ్మణ, శాలివాహన (కుమ్మరి), గీత పనివారలు, సగర సమాఖ్యలు ఏర్పాటు చేశారు. ఆయా ఫెడరేషన్ల నుంచి సబ్సిడీ రుణాలు అందజేయడం, కుల వృత్తులపై శిక్షణ, సబ్సిడీ కింద వివిధ రకాల మిషన్లు తదితర కార్యక్రమాలు చేపట్టాలి. కాని బడ్జెట్‌లో గత రెండేళ్లుగా బడ్జెట్‌లో కేటాయించడం లేదు. దీంతో ఫెడరేషన్లు ఖాళీగా ఉండటం, వివిధ కులాల వారికి ట్రైనింగ్‌లు బంద్‌ చేశారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement