Monday, February 19, 2024

TS: దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ‌లో సంక్షేమ కార్యక్రమాలు .. త‌ల‌సాని

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎప్పుడూ, ఎక్కడా జరగలేదని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ… ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా చేపట్టిన ఓటరు నమోదు, పోలింగ్ స్లిప్ ల పంపిణీ, నూతన టెక్నాలజీని ఉపయోగించి అభ్యర్ధి గుర్తు, ప్రభుత్వం చేసిన అభివృద్దిని వివరిస్తూ చేస్తున్న ఎన్నికల ప్రచారం, ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ చేస్తున్న ప్రచారం తీరు గురించి కూడా వివరించారు. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సాయి కిరణ్ యాదవ్ ను ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ అభినందించారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అందించిన సహకారంతోనే సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయగలిగామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా, రోడ్ల అభివృద్ధి, త్రాగునీటి సమస్య పరిష్కారం, వైకుంఠ ధామాల అభివృద్ధి వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు అందించిన ప్రోత్సాహంతోనే హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి సాధించి దేశంలోనే ముఖ్య నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచిందని చెప్పారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకొని ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని వివరించారు. గడిచిన 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలలోనే జరిగిందనే సంతోషాన్ని సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఏ అవసరమొచ్చినా…ఏ ఇబ్బంది కలిగినా తమకు పెద్ద దిక్కుగా శ్రీనివాస్ యాదవ్ ఉన్నారనే భరోసాను కల్పించామన్న విషయాన్ని గుర్తుచేశారు.

తాను 32 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నప్పటికీ పార్టీకి, పార్టీ నాయకత్వానికి కానీ విధానాలకు కట్టుబడి అంకితభావంతో పని చేస్తూ వచ్చామని వివరించారు. సనత్ నగర్ లో హిందువులు, ముస్లీం లు, క్రిస్టియన్ లు, సిక్కులు, నార్త్ ఇండియన్స్ వివిధ వర్గాలు, ప్రాంతాలకు చెందిన వారు నివసిస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరిస్తూ వారిని తగు విధంగా గౌరవిస్తూ వస్తున్నామని చెప్పారు. తనపై ఉన్న అభిమానంతో ఎవరికి వారు స్వచ్చందంగా ప్రచారం నిర్వహిస్తున్నారని, వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, హేమలత లక్ష్మీపతి, మహేశ్వరి శ్రీహరి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, నామన శేషుకుమారి, ఆకుల రూప హరికృష్ణ, ఉప్పల తరుణి, కిరణ్మయి, డివిజన్ అద్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement