Sunday, April 28, 2024

TS : 17ఎంపీ సీట్లను గెలిచి తెలంగాణ పొలిటికల్ లీగ్ కప్ కొడుతున్నాం.. బండి సంజయ్

400 స్థానాలతో మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు తథ్యం
17 సీట్లను గెలిచి టీపీఎల్ కప్ ను గెలవబోతున్నం….
మోదీలేని దేశాన్ని ఊహించుకోగలమా?
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగిన సంజయ్

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ – ‘‘ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోంది. ఒకవైపు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం బరిలో దిగింది. మరోవైపు ఐఎన్డీ కూటమి పేరుతో గుంట నక్కల పార్టీలన్నీ టీంగా బరిలో ఉన్నయ్… ఆ కూటమి టీంను చిత్తుగా ఓడించి 400ల స్థానాలతో కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నరు…’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్థాయి నాయకులతో ‘బూత్ విజయ సంకల్ప్ అభియాన్’ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్ తోపాటు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ జీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు..దేశంలో మాదిరిగానే రాష్ట్ర రాజకీయాల్లోనూ తెలంగాణ పొలిటికల్ లీగ్ (టీపీఎల్) ఆట మొదలైందన్నారు. ‘‘కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నాతోసహా 17 మంది సభ్యుల టీం బరిలోకి దిగినం. అటువైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ గుంట నక్కల టీంలు బరిలో దిగినయ్. వేర్వేరుగా బీజేపీని ఓడించడం సాధ్యం కాదని.. చీకటి ఒప్పందాలతో ఆ రెండు పార్టీలు ఒక్కటైనయ్… అయినప్పటికీ ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి టీపీఎల్ కప్ ను గెలవబోతున్నాం.. మోదీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం’’అని ధీమా వ్యక్తం చేశారు…

- Advertisement -

రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల రాశులు పోసినా ఎవరూ కొనేనాథుడే లేరన్నారు. తాలు, తరుగు పేరుతో దోచుకునేందుకు దళారులు సిద్ధమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులను మోసం చేస్తే మిల్లర్ల, వ్యాపారుల లైసెన్స్ రద్దు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం…. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ లైసెన్స్ ను కూడా ప్రజలు రద్దు చేయబోతున్నారని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement