Monday, April 29, 2024

Breaking | బాధితులను ఆదుకుంటాం.. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్​గ్రేషియా: మంత్రి సత్యవతి

రాష్ట్రంలో ములుగు జిల్లాలో పడినంత వర్షం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని, వరద బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో  ములుగు జిల్లా ఇన్​చార్జి ప్రత్యేక అధికారి ఎస్. క్రిష్ణ ఆదిత్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్​చార్జి ప్రత్యేక అధికారి గౌతమ్ పొట్రూ, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి విలేకరులతో మాట్లాడారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో 70 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షపాతం నమోదయిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 8 మంది చనిపోయారని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ గ్రామంలో ముగ్గురు వ్యక్తులు నీటిలో కొట్టుకపోయారని, రెండు జిల్లాల్లో వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని తెలిపారు.

నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ కేటాయించారని, బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నట్టు మంత్రి సత్యవతి తెలిపారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో 80మంది గ్రామస్తులు నీటిలో చిక్కుకున్నారని వారికి హెలికాప్టర్ ద్వారాఆహారం, మంచినీరు అందించినట్టు చెప్పారు. హెలికాప్టర్ ద్వారా బాధితులను  పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు.. మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్​గ్రేషియా..

వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం అందించడం జరుగుతుందని, అన్ని విధాలుగా నష్టపోయిన వారికి కుటుంబాలకు 25 వేల రూపాయలను తక్షణమే అందించినట్టు మంత్రి సత్యవతి తెలిపారు. ఏటూరునాగారం సమీపంలోని రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద  గతంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని, ప్రస్తుతం18 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నదని అన్నారు.  జిల్లాలో 27 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయగా ఆయా కేంద్రాలను వెయ్యికి పైగా మంది బాధితులు ఉన్నారని, రానున్న రోజులలో ఇలాంటి ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపలు పట్టేందుకు చెరులో దిగే మత్స్యకారులపై కేసులను నమోదు చేయాలని ఆదేశించారు.

- Advertisement -

దెబ్బతిన్న రోడ్లు.. ప్రయాణాలు నిలిపివేత..

కూలిపోయేలా.. ప్రమాదకరంగా ఉన్న రోడ్లపై రాకపోకలను నిలిపివేశామని, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను రిపేర్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఎక్కడైతే వరదలు తగ్గలేదో తగ్గిన వెంటనే, రిపేర్లు చేయడం జరుగుతుందన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కోటి రూపాయలను మంజూరు చేశారని, పకృతి బీభత్సం కాబట్టి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. పైనుండి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉధృతి పెరిగే అవకాశం ఉందని అన్నారు.  ఈ విలేకరుల సమావేశంలో సీఈ విజయ భాస్కరరావు,  కలెక్టరేట్ కార్యాలయ ఏ ఓ విజయ భాస్కర్, డి పి ఆర్ ఓ రఫీక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement