Saturday, May 4, 2024

అనేక దేశాల్లో బోనాలు ఉత్స‌వాలు జ‌రుపుకోవ‌డం గ‌ర్వ‌కార‌ణం.. మంత్రి త‌ల‌సాని


హైద‌రాబాద్ : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను నేడు అనేక దేశాలలో నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం చాంద్రాయణ గుట్ట నియోజకవర్గ పరిధిలోని గౌలిపురాలో గల భరతమాత దేవాలయం వద్ద, గుడిమల్కాపూర్ లోని జాంసింగ్ దేవాలయం వద్ద బోనాల సందర్బంగా 358 దేవాలయాలకు మంజూరైన 2.13 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆర్ధిక సహాయం చెక్కులను ఆయా దేవాలయాల కమిటీ సభ్యులకు మంత్రి అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… బోనాల ఉత్సవాలను ప్రజలు గొప్పగా, సంతోషంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి అధికారికంగా నిర్వహిస్తూ వస్తుందని తెలిపారు.

అంతేకాకుండా ఉత్సవాల నిర్వహణ కోసం దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు మాత్రమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఈ సంవత్సరం 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయగా, బోనాల ఉత్సవాలకు ముందే ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. గత నెల 22వ తేదీన గోల్కొండలో బోనాల ఉత్సవాలు ప్రారంభం కాగా, ఈనెల 9వ తేదీన సికింద్రాబాద్ బోనాలు జరిగాయని తెలిపారు. 16వ తేదీన హైదరాబాద్ బోనాలను నిర్వహిస్తున్న నేపధ్యంలో ఈ రోజు బోనాల చెక్కులను అందజేస్తున్నట్లు వివరించారు.

బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. బోనాల ఉత్సవాల విశిష్టతను తెలంగాణ ప్రభుత్వం మరింత పెంచిందన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాలను ఘనంగా జరుపుకోవాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఉమ్మడి దేవాలయాల కమిటీ అద్యక్షుడు భాస్కర్ రాజ్, మాజీ అధ్య‌క్షులు గాజుల అంజయ్య, రాకేశ్ తివారి, కైలాష్, ఆనందరావు, మధు యాదవ్, మధు గౌడ్, తదితరులు పాల్గొన్నారు. గుడిమల్కాపూర్ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు బంగారు ప్రకాష్, మిత్రక్రిష్ణ, లక్ష్మినారాయణ, జీవన్ సింగ్, శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement