Saturday, May 4, 2024

WGL: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభివృద్ధి ఏంటో చూపిస్తాం.. గండ్ర సత్యనారాయణ

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని, తాను ప్రజలను నమ్ముకున్నానని, అధికార పార్టీ వాళ్లు డబ్బును నమ్ముకున్నారని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు ఆరోపించారు. గురువారం భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి 5 గనిలో గేటు మీటింగ్ కు హాజరైన సందర్భంగా ఆయన కార్మికులతో మాట్లాడుతూ… పేద ప్రజల కోసం అహర్నిశలు పనిచేసే తనపైన అధికార బీఆర్ఎస్ నాయకులు కక్ష కట్టి ఓడించాలని డబ్బు సంచులతో బయలుదేరారన్నారు.

తాను గెలిస్తే ప్రజలు గెలిచినట్లు, వాళ్ళు గెలిస్తే డబ్బు గెలిచినట్లు అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీకు ఇల్లు ఇస్తాం, దళిత బంధు ఇస్తాం, బీసీ, మైనార్టీ బంధు ఇస్తామని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. గడిచిన తొమ్మిదిన్నర యేండ్ల కేసీఆర్ పాలనలో చెయ్యని అభివృద్ధి మళ్ళీ గెలిపిస్తే చేస్తారా అని ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.1లక్ష రుణమాఫీ చేసినం, పంటనష్ట పరిహారం అందించినం, గిట్టుబాటు ధర కల్పించినామని, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ ఇలా అనేక సంక్షేమ పథకాలు అందించామన్నారు. తెలంగాణ వస్తే
మన బ్రతుకులు మారుతాయి, మన బాధలు తీరుతాయని నమ్మిన ప్రజలను కేసీఆర్ నట్టేటముంచాడన్నారు.

కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని, మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓట్ల కోసం డబ్బు సంచులు పట్టుకొని బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారన్నారు. మనల్ని మోసం చేసిన వారిని, మనకు ఇల్లు ఇవ్వని వారిని మన ఇండ్లలోకి రానివ్వొద్దని వారు కోరారు. ఈ సమావేశంలో ఐఎన్ టి యు సి ముఖ్య కార్యకర్తలు జోగు బుచ్చయ్య, రాజేందర్, వేణుగోపాల్, బండి శ్రీను, మండల టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, జిల్లా ఉపాధ్యక్షులు అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, పృథ్వి, చరణ్, విజయ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement