Thursday, May 2, 2024

వాజేడులో దారుణం.. అన్నను బరిసెతో పొడిచి చంపిన తమ్ముడు

వాజేడు, జులై 7 ప్రభ న్యూస్ : ములుగు జిల్లా వాజేడు మండలంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఇప్పగూడెం గ్రామంలో మానవత్వం మరిచి అన్నను జంతువులను వేటాడే బరిసెతో తమ్ముడు పొడిచి చంపాడు. వారి తండ్రి మొడెం రామయ్య తెలిపిన వివరాల ప్రకారం… మొడెం చంటి (38) మొడెం శివాజీ. ఇద్దరు కొడుకులకు ఎకరం భూమిలో చెరో అరెకరం భూమి తీసుకోమని చెప్పగా.. లేదు ఎకరం భూమి నాకే కావాలి.. దానిని నేను అమ్ముకుంటా అని రామయ్య పెద్ద కొడుకు అయిన మొడెం చంటి రాత్రి 10 గంటల సమయంలో తండ్రి రామయ్య తమ్ముడు శివాజీలతో మద్యం మత్తులో గొడవకు దిగాడు.

దీంతో భయపడిన రామయ్య పక్కవారి ఇంటికి పారిపోగా.. ఇద్దరు అన్నదమ్ములు గొడవపడ్డారు. ఆ గొడవ పడుతున్న సందర్భంలో తమ్ముడు శివాజీ అన్న చంటిపై బరిసెతో దాడి చేసి పొట్టలో పొడవడంతో.. పేగులు బయటికి వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. మృతి చెందిన చంటి తల్లిదండ్రులతో, తమ్ముడితో తరచుగా గొడవపడేవాడని బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడు చంటి ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మురుదొండ గ్రామంలోని అమ్మాయిని పెళ్లి చేసుకొని.. అక్కడే 15సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాడు.

మృతుడికి ఓ నేర చరిత్ర కలదు :
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జీవనం సాగిస్తున్న మొడెం చంటి గత నాలుగు సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలోని ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారు. బెయిల్ పై విడుదలైన చంటి సొంత గ్రామమైన వాజేడు మండలం ఇప్పగూడానికి వచ్చి కొద్ది నెలలుగా తలదాచుకున్నాడు. మరలా భార్యా భర్తలు వెళ్లి జీవనం సాగిస్తూనే.. ఆమెపై గత నాలుగు నెలల క్రితం కత్తితో దాడి చేసి తన చిన్న కొడుకుతో పారిపోయి వచ్చి ఇప్పగూడెంలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే రాత్రి 10గంటల సమయంలో మద్యం సేవించి వచ్చి తమ్ముడు, తండ్రి పై గొడవ పడగా.. భూమిని అమ్మకూడదు పిల్లలు ఉన్నారు కదా అని ఎంత చెప్పినా వినకుండా గొడవ పడడంతో ఇంతటి దారుణం జరిగిందని తండ్రి రామయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. హత్యకు పాల్పడిన శివాజీ వాజేడు పోలీసులకు లొంగిపోవడంతో ఎస్సై అశోక్ సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement