Friday, May 3, 2024

విద్యార్ధులు తీవ్రవాదులా.. నిరసన తెలిపితే యావజ్జీవం విదిస్తారా?: ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి

నర్సంపేట : 2018లో శాశ్వత ప్రాతిపదికన ఎంపికైన ఆర్మి అభ్యర్థులకు నిన్నగాక మొన్న ప్రవేశపెట్టిన “అగ్నిపథ్” ఎలా వర్తిస్తుంది.. అది తప్పని నిరసిస్తే నిరుద్యోగుల ప్రాణాలు తీసారు.. వారేమన్నా తీవ్రవాదులా.. లేక గోద్రా అల్లర్లు చేసి ఊచ కోత కోసారా..? అని ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి అన్నారు. ఊచకోతలు కోసిన వాళ్లే దేశాల నేలుతున్నారు. అలాంటిది తమ హక్కులను కాలరాయకండి అని నిరసిస్తే వారి జీవితాలు నాశనం చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుంద‌న్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను చంపారు.. దేశానికి రక్షణగా ఉండే ఆర్మీ జవాన్ లను చంపారు. దేశ రక్షణ వ్యవస్థ అంటే ఆర్మీ.. అంటే దేశంలో గొప్పగౌరవం.. సైనికులంటే దేశ వ్యాప్తంగా దేశాన్ని కాపాడే దేవుల్లుగా కొలుస్తారు. అలాంటి వారిని అవమానిస్తే పుట్టగతులుండవు. అగ్నిపథ్ లో చేరిన వాళ్లను తర్వాత తమ బీజేపీ ఆఫీసుల్లో గార్డులుగా పెట్టుకుంటామని మధ్య ప్రదేశ్ బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గీయ అన్నాడు.. అగ్నిపథ్ అయిపోయాక కటింగ్ చేయచ్చు, ఇస్త్రీ చేయచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటాడు.. అసలు సిగ్గుండే ఈ మాట మాట్లాడుతున్నారా.. దేశ సైనికులంటే మీ ఆఫీసుల ముందు గార్డుల్లా పనిచేయాలా..? ఇదా దేశం కోసం సేవ చేసిన వారికిచ్చే గౌరవం.. దేశం మీకు అవకాశమిస్తే అహంకారం నెత్తికెక్కి ఇలాంటి చిల్లర కూతలు కూస్తున్నారు. దేశంలో అదే ప్రభుత్వరంగ సంస్థలను అడ్డికి పావుశేరు అమ్ముతున్న మోదీకి ఏ శిక్ష వేస్తారు?.. అన్యాయంగా 100 మంది రైతుల ప్రాణాలు తీసిన ప్రధాన మంత్రి కి ఏ శిక్ష వేస్తారు?.. ధరలు పెంచి దేశ ప్రజలను దరిద్రంలోకి నెట్టిన వాళ్ళకు ఏ శిక్ష వేస్తారు?.. అప్పులు ఎగ్గొట్టి దేశం దాటినోల్లకు కొమ్ము కాసినోళ్ళకు ఏ శిక్ష వేస్తారు?, కార్పోరేట్లకు ఎర్రతివాచీలు.. సామాన్యులకు యావజ్జీవాలా.. జనం తరిమికొడతారు కొడతారు జాగ్రత్త.. నిరుద్యోగులకు కాదు యావజ్జీవం వేయాల్సింది.. నిరుద్యోగుల చాతిలో తూఠా దించిన వాళ్ళను ఉరితీయాలి. వెంట‌నే అగ్నిపథ్ రద్దు చేసి మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలి. టీఆర్ఎస్ వెనక ఉందంటూ సిగ్గులేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు కాంగ్రేస్ బ్రతికుందా?.. వీళ్ళకు సిగ్గుంటే ఇలా మాట్లాడరు. ప్రాణాలు తీసింది ఆర్పీఎఫ్ బలగాలు.. విచారణ కూడా జరుగుతుంది దీని వెనుక టీఆర్ఎస్ ఉందని విమర్శించండం రేవంత్ అజ్ఞానానికి నిదర్శనం. ఒక జాతీయ పార్టీ కాంగ్రేస్ గల్లీకి దిగజారి మాట్లాడుతుంది. దేశంలో అగ్నిపథ్ విషయంలో ఇంత రచ్చ జరుగుతుంటే కాంగ్రేస్ గడ్డి పీకుతుందా?.. ఒక జాతీయ పార్టీ హోదాలో కాంగ్రేస్ ఫేయిల్ అయింది.. ఢీల్లీలో ఫేయిల్.. గల్లీలో ఫేయిల్.. కాంగ్రేస్ ప్రజలకు పనికిరాని పార్టీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement