Friday, April 26, 2024

నడ్డా రాష్ట్ర పర్యటన ఖరారు.. సతీసమేతంగా వరంగల్‌ రానున్నబీజేపీ నేత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌ కుమార్‌ ప్రారంభించిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లిdలో బయల్దేరి 11.45గంటలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌ చేరుకుని సతీసమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారని భాజపా వర్గాలు చెబుతున్నాయి. దర్శనం అనంతరం మధ్యాహ్న భోజన కార్యక్రమాలు ముగించుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో జరిగే సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 5.30గంటల ప్రాంతంలో తిరిగి హెలికాప్టర్‌లో బయల్దేరి శంషాబాద్‌ విమానాశ్రయానికి వస్తారు. విమానాశ్రయంలో ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న తాజ రాజకీయ పరిస్థితులు, మునుగోడు ఉప ఎన్నికపై చర్చిస్తారు. ఆ తర్వాత ఆయన ఢిల్లికి బయల్దేరి వెళతారు. నడ్డా రాక సందర్భంగా వరంగల్‌లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

ఆర్ట్స్ కళాశాలలో జరిగే బహిరంగసభలోనూ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్‌ నగర పోలీసు కమిషనర్‌ చెప్పారు. బహిరంగ సభలో ఇటీవల చోటు చేసుకున్న ఢిల్లి లిక్కర్‌ స్కాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని ఆయన చెప్పనున్నారు. మోడీ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు ఆయా పార్టీలకు చెందిన నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరెవరు చేరుతున్నారన్నది భాజపా నేతలు గోప్యంగా ఉంచుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement