Sunday, February 25, 2024

మళ్లీ పెరుగుతున్న గోదావరి… నీట మునిగిన 163 జాతీయ రహదారి…

వాజేడు : గత రెండు రోజులుగా వాజేడు మండలంతో పాటు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు గోదావరిలోకి భారీగా వరద నీరు చేరడంతో ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామం వద్ద గోదావరి ఉధృతంగా పెరుగుతుంది. గోదావరి పెరుగుతూ క్రమేపి మధ్యాహ్నం 1.00గంట సమయానికి. 12.480 మీటర్లకు చేరుకుంది. దీనితో తెలంగాణ చతిస్గడ్ సరిహద్దు ప్రాంతమైన టేకులగూడెం గ్రామ సరిహద్దులో గల 163 జాతీయ రహదారి లో లెవెల్ వంతెన నీట మునగడంతో అంతర్రాష్ట్ర రాకపోకలకు అంతరాయం కలిగి రవాణా సౌకర్యం స్తంభించింది.

రహదారిపై నడుము లోతు నీటి లో ప్రమాదమని తెలిసినప్పటికీ ప్రయాణికులు నడిచి వెళుతున్నారు. చతిస్గడ్ రాష్ట్రం తాళ్ల గూడెం గ్రామానికి చెందిన నెలరోజుల ఓ గిరిజన బాలింత కు జ్వరం రావడంతో పసిపాపను ఎత్తుకొని వరద నీటిలో నడిచి వైద్యం నిమిత్తం పేరూరు వైద్యశాలకు వెళ్లారు. వరదల సమయంలో అత్యవసరాల కోసం సరిహద్దు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు వర్షాలు కురుస్తుండడం మరోవైపు గోదావరి పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement