Monday, May 6, 2024

పురాత‌న‌భ‌వ‌నం కూలి-ఇద్ద‌రు మృతి-మ‌రొక‌రికి గాయాలు

వరంగల్ (ప్రభ న్యూస్) ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరంలోని మండిబజారులో మూడు షటర్లతో కూడిన పురాతన భవనం కూలిపోయి ఇద్దరు మృత్యువువాత పడ్డారు. ఈ దుర్ఘటనలో మరొకరు గాయపడగా,చికిత్స కోసం వరంగల్ ఎం జి ఎం ఆసుపత్రికి తరలించారు. కూలిపోయిన భవనం పక్కన కొత్తగా భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి.నిర్మాణ పనులు పర్యవేక్షించేందుకు, వాచ్ మెన్ ఉండేందుకు పాత భవనాన్ని ఆనుకొని ఒక షెడ్డు వేశారు. గత 10 రోజులుగా కురుస్తున్న వానలతో పాత భవనం నాని పోయి కూలిన శిథిలాలు షెడ్ పై పడ్డాయి. దీంతో ఆ షెడ్డులో ఉన్న వారిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో వాచ్ మెన్ తిప్పారపు పైడి (60), మహమ్మద్ ఫిరోజ్ (23)ఉన్నట్లుగా గుర్తించారు.

ఈ సంఘటనలో గాయపడిన మహిళ సమ్మక్కను చికిత్స కోసం పోలీసులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సమాచారం అందగానే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హుటాహుటిన మండిబజార్ చేరుకుని,కూలిపోయిన భవనంను పరిశీలించారు. వివరాలను తెలుసుకొని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే కూలిపోయిన భవనం యజమానికి తొలగించాలని నోటీసులు కూడా ఇచ్చారు. ఇటీవల ఇదే వరంగల్ చార్ బౌలి వద్ద ఓ పాత భవనం కూలగొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు మరణించిన ఘటన మరువక ముందే,పాత భవనం కూలి మరో ఇద్దరు మరణించడం కలకలం రేపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement