Monday, April 29, 2024

TS: అసెంబ్లీలో మంత్రులు, హరీష్‌ మధ్య మాటల యుద్ధం

హైద‌రాబాద్ – సాగునీటి ప్రాజెక్ట్ ల శ్వేత‌ప‌త్రంపై అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ‘ఇంజనీరింగ్‌ అధికారులు చెప్పడం వల్లే రీడిజైన్‌ చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూగర్భ జలాలు పెరిగాయి. ప్రాణహితకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్రానికి కేసీఆర్‌ లేఖ రాశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే వలసలు తగ్గాయి. ఎస్‌ఆర్‌ఎస్పీ-2కు నీళ్లిచ్చిన ఘనత మాది. కేసీఆర్‌ వచ్చాకే రెండు పంటలకు నీరిచ్చాం. కాంగ్రెస్‌ పాలనలో నీరు రాలేదు ఎందుకు.. కేసీఆర్‌ వచ్చాకే ఎలా నీళ్లు వచ్చాయి. అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం. కాంగ్రెస్‌ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని ‍కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రతీసారి అబద్ధాలే చెబుతున్నారు. గోబెల్స్‌ అవార్డు ఉత్తమ్‌కే ఇవ్వాలి అంటూ ఎద్దేవా చేశారు…

కాగ్ పై కాంగ్రెస్ ది సెల్ఫ్ గోల్ ..
30ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్‌ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టు వచ్చింది. కల్వకుర్తి ప్రాజెక్ట్‌ కట్టడానికి 30ఏళ్లు పట్టింది. కాగ్‌ రిపోర్టుపై కాంగ్రెస్‌ది సెల్ఫ్‌గోల్‌. కాగ్‌ నివేదికకు ప్రమాణికం లేదని గతంలో కాంగ్రెస్‌ చెప్పింది. కాగ్‌ రిపోర్ట్‌ను గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తప్పుపట్టాయి. కాగ్‌ నివేదిక తప్పుల తడక అని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. కాగ్‌ నివేదికల్లో ప్రమాణికం లేదని గతంలో కాంగ్రెస్‌ చెప్పింది అని గుర్తు చేశారు..

శ్వేత‌ప‌త్రం కాదు…అబద్దాల నివేదిక…
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నాలుగు అంశాలు అబద్ధాలే. గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారు. ఇందులో అబద్ధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తాను. మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. అయితే, 2014 నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్‌మానేరు ప్రాజెక్టుకు సంబంధించి రూ.106 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రూ.775 కోట్లు ఖర్చు చేసి మూడేళ్ల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేశామ‌ని వివ‌రించారు హ‌రీష్ రావు.

- Advertisement -

ఖర్చులు వర్సెస్‌ ఆయకట్టు విషయంలో శ్వేతపత్రంలో రెండుచోట్ల వేర్వేరుగా ప్రస్తావించారు. 2014కు 57.79 లక్షల ఎకరాలకు నీరిస్తే.. రూ. 54,234 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇదే నివేదికలో మరో చోట 1956-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీలోని తెలంగాణలో రూ.54,234 కోట్లు ఖర్చు పెట్టి 41.76 లక్షల ఎకరాలను నీరిచ్చామని చెప్పారు. ఒకే అంశంపై భిన్నమైన సమాచారాన్ని నివేదికలో పొందుపర్చారు. ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మాత్రం తేడా ఉందని అంకెల‌తో స‌హా వివ‌రించారు.

రాయలసీమ ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ… లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం (బీఆర్‌ఎస్‌) కేంద్రానికి ఫిర్యాదు చేయలేదన్నార‌ని హారీష్ లేవ‌నెత్తారు.. అయితే ఈ అంశానికి సంబంధించి గతంలోనే పూర్తి ఆధారాలతో సహా నేను పూర్తి వివరణ ఇచ్చాను. అయినా సరే మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు జీవో వచ్చింది 5/5/2020లో ఈ జీవో రాకముందే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. మే 5న జీవో వస్తే వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశాం. ఆ లెటర్లు కావాలంటే సభలో ప్రవేశపెడతాం. మేం అసలు ఫిర్యాదే చేయలేదనే అబద్ధాలను పదేపదే చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు అంటూ కామెంట్స్‌ చేశారు హ‌రీష్ రావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement