Friday, May 10, 2024

వడ్ల కొనుగోలుకు స్పీడ్​గా చర్యలు.. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వానాకాలం ధాన్యం సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డుస్థాయిలో వరి సాగు అయిన విషయం తెలిసిందే. గతేడాది ఖరీఫ్‌లో జరిగిన పొరపాట్లు ఈ ఏడాది ఖరీఫ్‌లో పునరావృతం కాకుండా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అధికారులు పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ధాన్యం కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆ తర్వాత కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాల నుంచి మిల్లులకు తరలించడంపై ఏర్పడే ఇబ్బందులను అధిగమించడంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రవాణా వ్యవస్థ ఏర్పాటు బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కలెక్టర్లు పౌరసరఫరాలశాఖ, వ్యవసాయశాఖ అధికారుల సమక్షంలో మిల్లర్లు, లారీ యజమానులతో సమీక్షలు పూర్తి చేశారు. మరో వారం, పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభంలోనే ధాన్యం కొనుగోళ్లపై రాస్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పూర్తి స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది యాసంగిలో మాదిరిగా కాకుండా ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది రాష్ట్రంలో దాదాపు లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా… కోటి 20లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. దాదాపు 20కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

మిల్లులకు ధాన్యం రవాణా బాధ్యత కలెక్టర్లకు…

కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు చేరవేసేందుకు రవాణా ఇబ్బందులను అధిగమించేందుకు రవాణా క్లస్టర్ల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మండలానికో రవాణా క్లస్టర్‌గా విభజించి టెండర్లు పిలవనున్నారు. టెండర్లలో పారదర్శకత కోసం ఆన్‌లైన్‌లో టెండర్లు పిలవనున్నారు. ముందుగా గుత్తేదారులు సమర్పించిన జాబితాతోపాటు స్వయర్గా వాహనాల పరిశీలన చేపట్టాలని రవాణా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఆధార్‌తో అనుబంధం అయిన ఖాతాల్లో నగదు జమ…

- Advertisement -

రైతులు ధాన్యం విక్రయించిన అనంతరం సత్వర చెల్లింపులు జరిగేలా ప్రభుత్వ ప్రత్యేక విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇదివరకు మాదిరిగా బ్యాంకు ఖాతా నంబరుతోపాటు ఇతరత్రా పత్రాలు తీసుకుని ఆన్‌లైన్‌లో చేసేవారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు లేకుండా రైతు పట్టాదారు పాసుపుస్తకం నంబరు, ఆధార్‌ కార్డుల వివరాలను మాత్రమే సేకరించి, ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement