Thursday, May 2, 2024

TSPSC – గ్రూప్ 2 ప‌రీక్ష వాయిదా వేయాల‌ని కోరుతూ భారీ ర్యాలీ.. కార్యాలయం ముట్ట‌డి..

హైదరాబాద్‌: గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. నాంపల్లిలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయం నుంచి సుమారు 2 వేల మంది అభ్యర్థులు పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. అభ్యర్థుల నినాదాలతో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. గ్రూప్‌-2 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు. ర్యాలీగా వస్తున్న అభ్యర్థుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కమిషన్ కార్యాలయం సమీపంలో అభ్యర్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు.

అభ్య‌ర్థుల విన్న‌పం ..

గ్రూప్ -2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను ఖరారు చేశారని.. కానీ ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్ష తేదీలు ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఒకే నెలలో గ్రూప్ – 2, గురుకుల పరీక్షల నిర్వహణ, సిలబస్‌లూ వేర్వేరుగా ఉండటంతో.. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రూప్ – 2 పరీక్షలోని మూడో పేపర్ (ఎకానమీ)లో గతంలోని సిలబస్‌కు అదనంగా 70 శాతం కలిపారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో మూడు నెలలు మానసిక ఆవేదనతో సరిగా చదవలేకపోయామన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్ – 2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు. మానవతా దృక్పథంతో తమ సమస్యను అర్థం చేసుకుని.. వెసులుబాటు కల్పించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement