Thursday, May 2, 2024

టీఎస్ఆర్టీసీ నుంచి ఒలెక్ట్రాకు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒలెక్ట్రా గ్రీన్​టెక్​ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను టీఎస్ఆర్టీసీకి సరఫరా చేయనుంది. ఈ ఆర్డర్ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదని ఓజీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ కేవీ.ప్రదీప్ తెలిపారు. ఎయిర్ కండీషన్డ్ ఇంటర్​సిటీ కోచ్ ఎలక్ట్రిక్ బస్సులు మహానగరాలైన హైదరాబాద్, విజయవాడ మధ్య తిరుగుతాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈసంద‌ర్భంగా టీఎస్ఆర్టీసీ సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తాము మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించామన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 3,400 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు.

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనార్ మాట్లాడుతూ.. మార్చి 2025 నాటికి హైదరాబాద్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోందన్నారు. మొదటిదశలో 550 ఈ-బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ నుంచి 550 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ వచ్చిందన్నారు. వీటిలో స్టాండర్డ్ ఫ్లోర్ 12 మీటర్లున్న.. 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ కోచ్ ఈ-బస్సులున్నాయన్నారు. స్థిరమైన, ఆర్థికంగా బలమైన, పెద్ద ఎత్తున ప్రజా రవాణా చేసే టీఎస్ఆర్టీసీతో కలిసి పనిచేసే అవకాశం మరోసారి వచ్చినందుకు తాము గర్విస్తున్నామన్నారు. ఈ బస్సులను త్వరలో దశలవారీగా పంపిణీ చేస్తామన్నారు.టీఎస్ఆర్టీసీతో ఒలెక్ట్రా అనుబంధం 40 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్​తో మార్చి 2019లోనే ప్రారంభమైందని ప్రదీప్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement