Sunday, April 28, 2024

TS – కనివిని ఎరుగని రీతిలో మేడారం జాతర…తల్లుల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం. : మంత్రులు పొంగులేటి , సీతక్క

జాతర నిర్వహణకు ప్రభుత్వం 110 కోట్లు మంజూరు.
తల్లుల దర్శనానికి 2 కోట్ల భక్తులు రానున్నారు.
మహా జాతరకు 6 వేల ఆర్టీసి బస్సులు.
మీడియా సమావేశంలో మంత్రులు పొంగులేటి ,సీతక్క వెల్లడి
.


ప్రభ న్యూస్ ప్రతినిధి ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క,కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాల కొకసారి జరిగే సమ్మక్క సారలమ్మ మహా జాతరను అధ్బుతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.70 రోజుల క్రితం మార్పు కోసం,ప్రజల దీవెన తో సమ్మక్క,సారక్క తల్లుల దీవెనలతో తెలంగాణాలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందనీ అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో స్థానిక శాసనసభ్యులు సీతక్క ఆధ్వర్యంలో కానీ వినీ ఎరుగని రీతిలో జాతర జరుగుతుందనీ అన్నారు.

ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారనీ తెలిపారు.ఒక పక్క అసెంబ్లీ నడుస్తున్న భక్తుల సౌకర్యం కోసం సీతక్క నిత్యం జాతర పనులను పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు చేసిందనీ,ప్రభుత్వానికి ప్రజల పట్ల ,భక్తుల పట్ల ఎంతో చిత్త శుద్ది ఉందో తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వం మేడారం జాతరకు 75 కోట్లు కర్చుపెడితే ఈ ప్రభుత్వం నష్టాలలో ఉన్నా 110 కోట్లు మంజూరు చేసి జాతరను అద్భుతంగా నిర్వహిస్తున్నామని అన్నారు.అలాగేమహా జాతరకు 2 కోట్ల మంది భక్తులు జాతరకు తరలి రానున్నారనీ తెలిపారు.జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసిందనీ అన్నారు.

గత ప్రభుత్వంలో జాతరకు 3వేల బస్సులు నడిపితే కాంగ్రెస్ ప్రభుత్వం లో 6వేల ఆర్టీసీ బస్సులను నడుపుతున్నమని అన్నారు.ఎన్నికల హామీలలో చెప్పిన విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు.జీరో టిక్కెట్టుపై ఇప్పటి వరకు 17 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారనీ అన్నారు.జాతర నిర్వాహనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 వేల మంది అధికారులు పనిచేస్తున్నారనీ తెలిపారు.పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపి 4వేల మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించామని,గతంలో మేడారం జాతరపై అనుభవం ఉన్న ఐదుగురు ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామని తెలిపారు.

జాతరకు అనుసంధానం అయ్యే సుమారు 270 కిలో మీటర్ల రోడ్లు నూతనంగా నిర్మించామని తెలిపారు.రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం వచ్చిందనీ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ప్రభుత్వం చూస్తుందనీ అన్నారు.ప్రజల సౌకర్యార్థం మంచి నీరు, టాయ్ లెట్ లు వేల సంఖ్యలో ఏర్పాటు చేశామని, 4రోజులలో 2కోట్ల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందనీ అన్నారు.భక్తులు అధికారులకు సహకరించి నిదానంగా దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకోవాలనీ సూచించారు.గత ప్రభుత్వం లో నష్టపోయిన ప్రజల కోరికలను రాబోయే 5 సంవత్సరాలలో సీంతో రేవంత్ రెడ్డి సహకారం తో నెరవేరాలని అమ్మవార్లను కోరుకుందామని అన్నారు.

సమన్వయంతో జాతరను విజయవంతం చేస్తాం. మంత్రి సీతక్క.

- Advertisement -

మేడారం జాతరను మంత్రులు,అధికారులు ,ప్రజా ప్రతినిధులతో కలిసి సమన్వయం తో జాతరను విజయవంతం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.జిల్లా ఇంఛార్జి మంత్రి గా ఉన్న నిరంతరం జాతర పనులను పర్యవేక్షిస్తూ సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అమ్మ వార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు దర్శనం కోసం తరలి వస్తున్నారని,అన్ని శాఖల అధికారులు రెండు నెలల నుండి నిరంతరం వీధులలో ఉండి జాతర ఏర్పాట్లు చేస్తున్నారనీ తెలిపారు.భక్తులు, వీఐపీ లు అధికారులకు పోలీసులకు సహకరించాలన్నారు.మేడారం జాతరకు 1996 సంవత్సరం లోనే రాష్ట్ర పండుగ గా గుర్తింపు లభించిందనీ, కేంద్ర ప్రభుత్వం కుడా జాతీయ పండుగగా గుర్తించాలని అన్నారు.మేడారం జాతరకు సహకరించిన సీ.ఏం రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్ మంత్రులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.జాతర పూర్తయిన తర్వాత కర్చులన్ని ప్రజల ముందు పెడతామని ,మిగిలిన డబ్బులతో మేడారం జాతరకు శాశ్వత ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఎస్పి డా. షబరీష్,అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, ఈవో రాజేందర్,ఉత్సవ కమిటీ చైర్మన్ అరెం లచ్చుపటెల్,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జిల్లా అధికారులు ,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement