Monday, April 29, 2024

TS – అధికార లాంచనాలతో ఎమ్మెల్యే లాస్య అంత్య‌క్రియ‌లు.. ప్రముఖుల సంతాపాలు

హైదరాబాద్ – కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం పూర్త‌య్యింది. గాంధీ హాస్పిట‌ల్‌లో శవపరీక్ష పూర్తి చేసిన వైద్యులు.. ఆమె భౌతికఖాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత పార్థివదేహాన్ని తరలించారు. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జ‌ర‌గ‌నున్నాయి.

లాస్య అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. లాస్య నందిత మృతి బాధాకరమని మంత్రి చెప్పారు. ప్రమాద సమయంలో ఆమె సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని పోలీసులు చెప్పారని వెల్లడించారు.

కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ విజయా రెడ్డి గాంధీ అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్‌ఎస్ ద‌గ్గరుండి పర్యవేక్షించారు. కాగా, నందిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నందిత తల్లి, సోదరిని ఓదార్చారు.

ప్ర‌ముఖుల సంతాపాలు..

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై హరీశ్‌ రావు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని హరీశ్‌ రావు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

చంద్ర‌బాబు సంతాపం..
తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే లాస్య నందిత మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆమె ముందు ఉజ్వల భవిష్యత్తు ఉండగా, విధి మరొకటి తలచిందన్నారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా..
చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య మృతి ఎంతో బాధ కలిగించిందని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని ఆకాంక్షించారు.

లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. చిన్న యయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య.. మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అవుతుందని అనుకోలేదు.
– తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

చిన్న వయస్సులోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంచి రాజకీయ భవిష్యత్తు ఉండి, తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతూ అందరి మన్ననలు పొందుతున్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరం. సంవత్సరం క్రితం వారి తండ్రి సాయన్న మరణం, ఇప్పుడు కూతురు నందిత అకాల మృత్యువుకు లోనుకావడం విచారకరం. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిజేస్తున్నాను.
– ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

లాస్య నందిత మరణం కంటోన్మెంట్‌ ప్రజలకు, బీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటు.
– వేముల ప్రశాంత్‌ రెడ్డి

చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై.. తన తండ్రి, దివంగత ఎమ్మెల్యే సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతూ అందరి మన్ననలు పొందిన నందిత అకాల మరణం తీవ్ర బాధాకరం. ఏడాది క్రితం సాయన్న మరణం, ఇప్పుడు ఆయన కూతురు మృతి చెందడం విచారకరం
– ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. లాస్య గొప్ప భవిష్యత్‌ ఉన్న యువ నాయకురాలు. ప్రజల మద్దతుతో ఎన్నికై ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి.
– మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి

ఉజ్వల భవిష్యత్ ఉన్న లాస్య మరణం బాధాకరమన్నారు..

కంటోన్మెంట్ శాసనసభ్యులు లాస్య నందిత మృతి పట్ల మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న లాస్య అతిపిన్న వయస్సులో రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన సబిత, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement