Wednesday, May 1, 2024

దేశమంతా కొన్నప్పుడు ఇక్క‌డే ఎందుకు కొనం.. యాసంగి పేరుతో టీఆర్‌ఎస్ కొత్త డ్రామా: బండి సంజయ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో యాసంగి సీజన్‌లోనూ కచ్చితంగా రా రైస్ కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావ్ సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేస్తోందని వారు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పీయూష్ స్పందిస్తూ ‘అసలు రా రైస్ కొనబోమని చెప్పిందెవరు? దేశవ్యాప్తంగా బియ్యం ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆపుతాం? పక్కాగా రా రైస్ కొంటాం. రైతులకు ఇబ్బంది కాకుండా చూడటం మా కనీస బాధ్యత’ అని స్పష్టం చేశారు. గతంలో ఇస్తామన్న బియ్యం ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనేలేదు.

అయినా దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా గతంలోనే టీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలన్నింటికీ సమాధానమిచ్చానని పీయూష్ గుర్తు చేశారు. ఇకపై భవిష్యత్తులో తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసిందన్న ఆయన, మళ్లీ ఇప్పుడు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

సమావేశం అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం కేసీఆర్ ప్రభుత్వం బీజేపీని బదనాం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. గతంలోనూ ఇదే అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు, ఢిల్లీకి వచ్చి రాష్ట్ర మంత్రుల బృందం రకరకాల డ్రామాలాడి భంగపడ్డ విషయాన్ని ఈ సందర్భంగా సంజయ్ గుర్తు చేశారు. మళ్లీ యాసంగి పేరుతో టీఆర్ఎస్ కొత్త డ్రామాలకు తెరదీసిందని విమర్శించారు.

పసుపు రైతులకు పరిహారంపై ధర్మపురి అరవింద్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించారు. అకాల వర్షాల కారణంగా గతేడాది పసుపు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫసల్ బీమా అమలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement