కుత్భుల్లాపూర్ క్రైమ్ (ప్రభ న్యూస్) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవ్వాల జరిగింది. బిహార్ రాష్ట్రం కైమూర్ జిల్లా భగవాన్ పూర్ గ్రామానికి చెందిన సోని దేవి, టి.పాండే (42) బతుకుదేరువుకోసం హైదరాబాద్‌కు వచ్చారు. జగద్గిరిగుట్ట శ్రీనివాస్ నగర్, రింగ్ బస్తి లో ఉంటున్నారు. భర్త గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండగా.. భార్య కూలీపనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇవ్వాల ఉదయం ఇంటినుండి పనినిమిత్తం బయలు దేరి.. మార్గం మధ్యలో తనతోపాటు పనిచేసే నాగరాజును బైక్ పై ఇద్దరు బయలుదేరారు.
కైసర్ నగర్ శ్రీ కృష్ణ ఆలయం దగ్గరకు రాగానే బైక్ అదుపు తప్పడంతో ఇద్దరు కింద పడ్డారు. దీంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ పాండే తలమీది నుంచి వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న అతని భార్య సోనిదేవి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.