Sunday, May 19, 2024

ఇంటింటికీ మంచినీటిని అందజేస్తోన్న రాష్ట్రం.. తెలంగాణపై కేంద్రం ప్రశంస

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇంటింటికీ శుద్ధి చేసిన మంచి నీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ ప్రశంసించారు. గురువారం జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ , యూనిసెఫ్‌ నిర్వహించిన నేషనల్‌ వాటర్‌ శానిటేషన్‌ హైజిన్‌ కాంక్లేవ్‌ 2022 సదస్సులో వర్చువల్‌గా మంత్రి గజేంద్ర సింగ్‌ పాల్గొని తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్ల అభివృద్ధి కోసం మంచి నీటి సరఫరా సహా పలు పథకాలను అమలుతీరును ఆయన అభినందించారు. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలను కేంద్రం ప్రసంశించడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయాలని ఆయన కోరారు. రాష్ట్రానికి 19 వేల కోట్ల రూపాయలను మిషన్‌ భగీరథ అమలు కోసం విడుదల చేయాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రికైన మిషన్‌ భగీరథ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 100 గ్రామీణ ఆవాసాలకు తాగునీటి సౌకర్యం కల్పించామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

అందులో భాగంగా 23 వేల 930 గ్రామీణ ఆవాసాల్లోని 2 కోట్ల 5 లక్షల70 వేల గ్రామీణ జనాభాకు 54 లక్షల6 వేల నల్లా కనెక్షన్‌ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించి తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. నిర్దేశించిన 2024 కంటే ముందే లక్ష్యాన్ని చేరుకుందని పలుమార్లు కేంద్రం ప్రశంసించి దేశంలోనే అన్ని రాష్ట్రాలు స్ఫూర్తి పొందాలని సూచించిందని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వస్తే మహిళలు బిందెలను పట్టుకుని కిలోమీటర్లు మేర నడిచి తాగునీరు తెచ్చుకోవల్సిన దుస్థితిని అనుభవించారన్నారు. అదిలాబాద్‌, ఖమ్మం లాంటి ఆదివాసీ ప్రాంతాల్లో జనం కలుషిత జలాలు తాగి అతిసార వ్యాధులతో ఇబ్బందులు పడేవారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశంతో గడువుకు ముందే మిషన్‌ భగీరథ పథకాన్ని పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు సురక్షిత జలాలు అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సిఎం కేసీఆర్‌ సారథ్యంలో వివిధ పథకాల అమలులో బంగారు తెలంగాణ సాకారమవుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement