Thursday, May 2, 2024

Big story | పిల్లల చదువులు వర్షార్పణం.. ఈనెలలో పాఠశాలలకు అత్యధిక సెలవులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల కారణంగా పిల్లల చదువులు ఈనెలలో అటకెక్కాయి. ఎన్నడూ లేనంతగా ఈ నెలలో పాఠశాలలకు ఎక్కువ సెలవులు వచ్చాయి. ఎడతెరిపీలేకుండా హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. జిల్లాల్లో గ్రామాల మధ్య రాకపోకలు బంద్‌ అయిన ఘటనలూ ఉన్నాయి. ప్రజా రవాణా అస్తవ్యస్తంగా తయారైంది. ఈక్రమంలో విద్యార్థులు భారీ వర్షాల్లో బడులకు పోలేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తింది.

దీంతో ఇక చేసేదేమీలేక భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులను దశలవారీగా ప్రకటిస్తోంది. వర్షాలు ఇలానే ఉంటే మరో రెండు మూడ్రోజులు కూడా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా ఈనెలలో 20, 21, 22 (జీహెచ్‌ఎంసీ పరిధిలో) తేదీల్లో ఇప్పటికే సెలవులను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాస్త వర్షం తగ్గుముఖం పట్టడంతో 24, 25వ తేదీన విద్యాసంస్థలు యథావిధిగా నడిచాయి. ఒక్క 24వ తేదీన మినహా 25వ తేదీన కూడా ఎడతెరిపీ వర్షం కురిసింది.

- Advertisement -

జలాశయాలు నిండు కుండను తలపిస్తూ వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థి నెలకొంది. దీంతో ముందే అప్రమత్తమైన ప్రభుత్వం 26, 27న కూడా సెలవులను ప్రకటించింది. ఈక్రమంలో బుధ, గురువారాలు పాఠశాలలు బంద్‌ అయ్యాయి. ఈ రెండ్రోజుల సెలవు తర్వాత 28వ తేదీన ఆప్షనల్‌ హాలీడే ఉందని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. తర్వాత రోజు 29వ తేదీన మొహర్రం పండుగ నాడు అధికారిక సెలవు ఉండనే ఉంది. 30వ తేదీన ఆదివారం రానే వచ్చింది. ఇలా వరుసగా సెలవులు ఉన్నాయి.

31వ తేదీ సోమవారం. ఒకవేళ విద్యాసంస్థలు ప్రారంభమైనా వర్షాల నేపథ్యంలో తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు చాలా మంది పేరెంట్స్‌ విముఖత చూపిస్తున్నారు. హైదరాబాద్‌ వాసులకు బోనాలు పండుగ ఎంతోప్రత్యేకం. మొన్న ఆషాఢమాసంలో జరిగిన బోనాల పండుగను ఒక్కో వారంలో జరుపుకుంటారు. అవి ఆషాఢమాసంలో ప్రారంభమై శ్రావణ మాసంతో ముగుస్తాయి. ఈనేపథ్యంలో బోనాల పండుగ సందర్భంగా పాఠశాలలకు ఒక రోజు సెలవులను ప్రకటించారు. వీటికి తోడూ సాధారణ సెలవులు ఉండనే ఉన్నాయి. పండుగలు, పబ్లిక్‌ హాలిడేలు షరామామూలే.

ఇలా చూసుకుంటే ఈ నెలలో విద్యాసంస్థలకు సెలవులు ఎక్కువగానే వచ్చాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈనెలలో జరగాల్సిన ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1 పరీక్షలు కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో పూర్తయితే వర్షాల కారణంగా కొన్ని స్కూళ్లలో వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే బడిబాట పట్టిన పిల్లలు వరుసగా సెలవులు రావడంతో పుస్తకాలను పక్కనబెట్టి మొబైల్‌ ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి వాటితోనే గడుపుతున్నారని పేరెంట్స్‌ చెబుతున్నారు. పిల్లల అల్లరి ఎక్కువ అయిపోయిందని, చెప్పినా వినడంలేదని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement