Saturday, May 11, 2024

ఉపాధి పథకం అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రగామి: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశంతో అధికారులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు కష్టపడి పని చేయడం వలనే ఉపాధి హామీ పథకం అమలులో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. గతంలో తొలగించిన ఫీల్డు అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, సెర్ప్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తామని సిఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎర్రబెల్లిని సెర్ప్‌ ఉద్యోగులు, ఉపాధి హామీ ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 3,780 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి 28 లక్షల కుటుంబాలకు చెందిన 48 లక్షల మంది కూలీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పని కల్పించామన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 14 కోట్ల 64 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటి వరకు 14 కోటల్‌ 9 లక్షల పని దినాలను కల్పించామన్నారు. భవిష్యత్‌లో కూడా అదే స్ఫూర్తితో పని చేసి ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో అమలు చేయాలని ఉద్యోగులను ఆయన కోరారు. ఇదిలావుండగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూడు లక్షల పది వేల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 11,750 కోట్ల బ్యాంకు లింకేజి సెర్ప్‌ ద్వారా కల్పించామన్నారు. గత ఏడున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 55,913 కోట్ల బ్యాంక్‌ లింకేజీని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళ స్వయం సహాయక సంఘాలకు కల్పించామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement