Monday, April 29, 2024

దేశంలో ఆరో పెద్ద ఆదాయ వనరు – దేశ సంపదలో తెలంగాణ కీలకం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జీఎస్‌డీపీ పరంగా తెలంగాణ దేశంలో ఆరో పెద్ద రాష్ట్రంగా ఎదిగింది. 2020-21 తలసరి ఆదాయంలో తెలంగాణ రూ.2,37,632కు చేరింది. అదే సమయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు జాతీయ స్థాయిలో వృద్ధిరేటు 3.6శాతం కాగా, తెలంగాణలో 14.3శాతం వృద్ధిని కనబర్చాయి. ద్వితీయ రంగంలో 16.5శాతం ప్రగతికి చేరింది. 2014-15లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5,05,849 కాగా భారత దేశం జీడీపీ 1,24,67,959గా ఉన్నది. తెలంగాణ వృద్ధి 12శాతంగా ఉండగా, జాతీయ స్థాయిలో 11శాతం ఉంది. తెలంగాణ వాటా 4.1శాతం కాగా, 2020-21లో తెలంగాణ జీఎస్‌డీపీ 9,80,407తో, దేశం జీఎస్‌డీపీ 1,97,45,670గా ఉంది. తెలంగాణ 2.4శాతం వృద్ధిరేటు నమోదు చేసుకోగా జాతీయ స్థాయిలో మైనస్‌ 3 శాతం లోటులోకి వెళ్లింది. తెలంగాణ వాటా జాతీయ స్థాయిలో 5శాతానికి పెరిగింది.

ఫార్మారంగంలో జాతీయ స్థాయిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. కొత్తగా పురుడు పోసుకున్న ఏడేళ్లలోనే సుస్థిర రాజకీయ నాయకత్వంతో మరోసారి అంతర్జాతీయ, జాతీయ గుర్తింపును తెలంగాణ సొంతం చేసుకుంది. ఏ రంగంలో చూసినా ఆర్థికం నుంచి సేవలు, పర్యాటకం, ఐటీ, ఎగుమతులు, వ్యవసాయం వరకు అన్ని రంగాల్లోనూ తలెత్తుకుని సగౌరవంగా నిల్చింది. హైదరాబాద్‌ పార్మాసిటీగా అభివృద్ధిపర్చే లక్ష్యంతో సుస్థిర పారిశ్రామిక నగరానికి అంతర్జాతీయ గుర్తింపుగా ఏర్పాటుకు కృషి చేస్తోందని, జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం, వ్యవసాయం, పరిశ్రమలు, ద్వితీయ రంగం, ఇతర రంగాల్లో అద్భుత పురోగతి సాధిస్తోందని తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌ -2021 నివేదిక వెల్లడించింది. ఆర్ధిక, ప్రణాళిక శాఖ రూపొందించిన ఈ నివేదికను బుధవారం ఆవిష్కరించారు.

ఈ నివేదికలో తెలంగాణ ఆర్థిక స్థితిగతులను తేటతెల్లం చేసింది. 2015-16 ఆర్థిక యేడాది నుంచి వార్షిక వృద్ధిరేటు ఏనాడూ తగ్గకుండా 9శాతం కంటే ఎక్కువగా నమోదు చేసుకుంటోందని పేర్కొంది. రాష్ట్ర దేశీయోత్పత్తిలో సేవా రంగం వాటా 60శాతంగా ఉందని, వ్యవసాయ రంగంలో ఉపాధి వాటా అతిపెద్ద వాటా కల్గి ఉందని వెల్లడించింది. మొత్తం రాష్ట్ర జనాభాలో 54శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడినట్లుగా నివేదిక వెల్లడించింది. జీఎస్‌డీపీలో వ్యవసాయరంగం వాటా 16శాతం ఉండగా, ఇందులో 86శాతం చిన్న, సన్నకారు రైతులుగా విశ్లేషించింది. ఇక పారిశ్రామిక రంగం వాటా 17శాతంగా తెలిపింది. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం ఫార్మా, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, హైటెక్‌ రంగాలు, టెక్స్‌టైల్స్‌, లెదర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మినరల్స్‌ వంటివన్నీ కలుపుకొని ఉన్నాయని తెలిపింది.

వివరాలు రంగాల వారీగా…
రంగం 2014-15 2020-21
జీఎస్‌డీపీ 5,05,849 కోట్లు 9,80,407 కోట్లు
తలసరి ఆదాయం 1,24,104 2,37,632
సొంత వనరులు 35,146 కోట్లు 66,648 కోట్లు
వ్యవసాయ వృద్ధి 2శాతం 16.5శాతం
వ్యవసాయ, ఫిషింగ్‌ 76,123 కోట్లు 1,84,321 కోట్లు
వరి 9,528 కోట్లు 47,440 కోట్లు
పత్తి 7,549 కోట్లు 19,025 కోట్లు
రాగులు 530 కోట్లు 3,808 కోట్లు
ఎలక్ట్రిసిటీ, నీరు 7,340 కోట్లు 16,871 కోట్లు
మైనింగ్‌ 14,706 కోట్లు 31,963 కోట్లు
విద్యుత్‌ వినియోగం 39,519మి.యూనిట్లు 58,515ఎంయూ
సేవల రంగం 2,86,011 కోట్లు 5,33,230 కోట్లు
ఐటీ రంగం వృద్ధి 13.27 12.98
వ్యవస్థాపిత విద్యుత్‌ 7,778 మెగావాట్లు 16,931 మెగావాట్లు

మౌలిక వసతుల కల్పనలోనూ తెలంగాణ అద్భుత వికాసం సాధించింది. రహదారులు, రైల్వే సౌకర్యంలో ముందంజలో ఉందని, అద్భుతమైన రోడ్లు, కనెక్టివిటీ ఉన్నట్లుగా తెలిపింది. రాష్ట్రం నుంచి 2,592 కిలోమీటర్ల పొడవుతో 16 జాతీయ రహదారులు ఉన్నాయని తెలిపింది. ఈ వాటా రాష్ట్రం మొత్తం రహదారుల్లో 10 శాతంగా వెల్లడించింది. 200లకు పైగా రైల్వే స్టేషన్లు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానమై ఉన్నాయని వెల్లడించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement