Monday, May 6, 2024

బ‌డ్జెట్ ఎలా…

కీలక రంగాలకు కేటాయింపులు పెంచాల్సిందే
ఇప్పటివరకు వచ్చిన రాబడి 70 శాతంపైనే
ఖర్చులు, ఆదాయాలను పరిశీలిస్తున్న ఆర్ధిక శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రస్తుత ఆర్ధిక యేడాది పన్ను లక్ష్యాలను సవరించుకుంటున్న సర్కార్‌ భారీ బడ్జెట్‌ దిశగా సిద్దమవుతున్నది. డిసెంబర్‌ నెల పూర్తయ్యేనాటికి పన్నుల రాబడి అంచనాలు 70శాతం లక్ష్యం చేరాయి. ఈ ఏడాది ప్రతిపాదించిన బడ్జెట్‌కు దీటుగా వచ్చే ఏడాదిలో ఈ మొత్తం మరో రూ. 30వేల కోట్లను పెంచుకునేలా ప్రాథమికంగా నిర్ణయించింది. వచ్చే బడ్జెట్‌లో సింహభాగం నిధులు, ప్రభుత్కవ ప్రాధాన్యత సంక్షేమరంగంతోపాటు వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యరంగాలకేనని తెలుస్తోంది. దళితబంధు పథకానికి 2023-24లో రూ. 20 వేల కోట్లు కేటాయించేందుకు సన్నాహాలు జరుగు తున్నాయి.

వచ్చే ఆర్ధిక ఏడాది బడ్జెట్‌ కోసం ఆర్ధిక శాఖ విస్తృతంగా కసరత్తు చేస్తోంది. ఆన్‌లైన్‌లో శాఖల వారీగా ప్రతిపాదనల ప్రక్రియ మొదలుపెట్టింది. ప్రస్తుత బడ్జెట్‌ కేటాయింపులు, ఇప్పటివరకు చేసిన ఖర్చులు, వచ్చే ఆర్ధిక ఏడాది అవసరాలను ఆర్ధిక శాఖ ప్రతిపాదనల రూపంలో కోరుతోంది. మౌలిక వసతులు, గ్రామీణ, పట్టణాభివృద్ధికి కూడా విశేస్‌ ప్రాధాన్యత దక్కనుందని అంటున్నారు. కాగా, ఈ ఏడాదిలోనే ఉద్యోగుల సంక్షేమానికి ఇతోదికంగా పాటుపడాలన్న సర్కార్‌ ఆకాంక్షలకు ఆర్ధికలోటుతోపాటు తాజా మాంద్యం పరిస్థితులు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనులకు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పెట్టుబడి తెస్తున్న రుణాలపై వడ్డీల భారం భారీగా పెరుగుదల సంతరించుకున్నది. రాష్ట్ర అవరణకు ముందున్న అప్పులు మొదలుకొని తాజా అప్పులపై రీ పేమెంట్‌ దిశగా ప్రభుత్వం భారీ చెల్లింపులు చేయాల్సి వస్తున్నది. ఎవరు అధికారంలో ఉన్నా తప్పనిసరిగా చెల్లించాల్సిన కొన్ని పద్దులకు చెల్లింపులు ఏనెలకానెల చెల్లించాల్సిందే. లేకపోతే పాలనపై తీవ్ర ప్రభావం నమోదై రాష్ట్ర ఆర్ధిక పరపతిపై చెడు ప్రభావం చూపే అవకాశాలుంటాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఇటువంటి తప్పనిసరి ఖర్చుల భారం మోయలేనంతంగా పెరిగాయి. రెవెన్యూ వ్యయంలో సగానికిపైగా ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీలు, పించన్లకే ఖర్చు చేయల్సి వస్తోంది. రెవెన్యూ వ్యయం రూ. 88,824కోట్లలో రూ. 45,770 కోట్లు జీతాలు, వడ్డీలు, పించన్ల ,ఎల్లింపులకే గతేడాది ఖర్చు చేయాల్సి వచ్చిందంటే పన్నులను పెంచకుండా, ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వం చేస్తున్న సర్దుబాట్లు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రధానంగా రాష్ట్ర అప్పులపై వడ్డీల చెల్లింపులు 2016-17తో పోలిస్తే 2017-18లో 26శాతం పెరుగుదలతో రూ. 10,836 కోట్లకు చేరుకున్నాయి. పించన్ల పద్దు 32 శాతం పెరుగుదలతో రూ. 11,932కోట్లకు చేరింది. రెవెన్యూ రాబడితో పోలిస్తే వడ్డీ చెల్లింపుల భారం 14వ ఆర్ధిక సంఘం నిర్ధేశిత లక్ష్యం 8.31శాతం కంటే ఎక్కువై 12.19 శాతానికి చేరింది. మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల వాటా రెవెన్యూ ఖర్చుల్లో ఇప్పటికే స్థిరంగా 27శాతానికి చేరుకుంది. రాయితీల వాటా కూడా రెవెన్యూ ఖర్చులలో ఏడు శాతం ఉండగా, రాయితీలలో 53 శాతం ఉన్న విద్యుత్‌ రాయితీలు రూ. 3262కోట్లు కొంతమేర తగ్గినట్లుగా ప్రభుత్వ లెక్కలు దృవీకరిస్తున్నాయి. అయితే బియ్యం రాయితీని గత కొంత కాలంగా సంక్షేమ శాఖల పద్దుల్లో చేర్చిన ఫలితంగా సాంఘిక సంక్షేమ రాయితీ రూ. 780కోట్లు, గిరిజన సంక్షేమం రూ. 245 కోట్లు, రైతులకు విత్తనాల సరఫరా, వ్యవసాయ యాంత్రీకరణ మీద రాయితీలు పెరగడంతో ఈ రంగంపై 100శాతం రాయితీలు నమోద వుతున్నాయి. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయనన్ని ప్రజా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. నిరంతరాయ 24 గంటల వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్‌కు భారీగా విద్యుత్‌ను కొనుగోలు చేస్తూనే, ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా సమీకరించలేని రీతిలో స్వల్ప వడ్డీలకే రుణాలను సమీకరిస్తోంది. అయితే పెరుగుతున్న ఖర్చులు, ఆర్ధిక మాంద్యంతో తగ్గుతున్న రాబడులు, పన్నుల లోటు, కేంద్ర సాయంలో కోతలు, జాప్యం కారణంగా వివిధ ప్రాజెక్టులపై అంచనా వ్యయాల్లో పెరుగుదల వంటివి సర్కార్‌పై ఆర్ధిక భారం మోపుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అప్పులు భారీగా పెరగ్గా మరోవైపు రెవెన్యూ వసూళ్లకంటే వడ్డీ చెల్లింపులు మించరాదన్న పరిమితిని దాటుతోంది. ఏ రాష్ట్రమైనా తన పన్నుల రాబడికంటే 10శాతానికి మించి రుణాలపై వడ్డీలకు చెల్లింపులు చేయరాదని ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం చెబుతోంది. అప్పుడే ఆ రాష్ట్రం స్థిర ఆర్ధిక వృద్ధిరేటును సాధిస్తున్నట్లుగా ఈ నిబంధన తెలుపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement