Sunday, April 28, 2024

TS: బీఆర్ఎస్ సర్కార్ పై సీఈఓకు ఫిర్యాదు చేసిన టీ కాంగ్రెస్‌ నేతలు

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ను కాంగ్రెస్‌ నేతలు కోరారు. ఇవాళ ఉదయం ఈసీ కార్యాలయానికి వెళ్లిన నాలుగు అంశాల విషయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్ (సీఈవో)ను కలిసిన అనంతరం బయటకు వచ్చిన కాంగ్రెస్‌ నేతల తరఫున ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారన్నారు. రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోందన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదన్నారు. రైతు బంధు నిధుల్ని కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు. భూరికార్డులు మారుస్తున్నట్లు కూడా తమకు సమాచారం ఉందన్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్‌లోకి మారుస్తున్నారని, ఈ విషయాలన్నీ సీఈవో దృష్టికి తీసుకెళ్లామన్నారు. అసైన్డ్‌ భూముల రికార్డులు మార్చకుండా చూడాలని కోరామన్నారు. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్‌ నిఘా పెట్టాలని కోరామని తెలిపారు. అలాగే డిసెంబర్‌ 4వ తేదీన జరగబోయే కేబినెట్‌ భేటీలో కేసీఆర్‌ సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాలని కాంగ్రెస్‌ నేతలు ఈసీని కోరినట్లు తెలుస్తోంది. ఈసీని కలిసిన బృందంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement