Thursday, May 2, 2024

Big story : కల్లు, మద్యం అంతా కల్తీ.. నిషేదిత మత్తు పదార్ధాలతో తయారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కల్తీకి కాదేది అనర్హం అంటున్నట్లుగా ముఠాలు తెగిస్తున్నాయి. డ్రగ్స్‌తోపాటు నిషేదిత మత్తు పదార్ధాలతో కల్తీ కల్లు, కల్తీ మద్యం తయారీ రాష్ట్రంలో జోరందుకుందని ఆబ్కారీ శాఖ అనుమానిస్తోంది. నిఘా లోపంతో ముఠాలు రెచ్చిపోతున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అంచనా వేస్తోంది. మత్తు పదార్ధాలపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం కల్తీ కల్లు, మద్యంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. కల్తీ కల్లు మళ్లి వేళ్లూనుకుంటోందనే వార్తలు ఆబ్కారీ శాఖను కలవరానికి గురిచేస్తున్నాయి. కల్తీ కల్లులో కిక్కు కోసం రకరకాల మత్తు పదార్ధాల వినియోగం ఇటీవలే కాలంలో మళ్లి ఎక్కువైందని తెలుస్తోంది. కల్తీ కల్లు తయారికి కీలకమైన నిద్రమాత్రల్లో వాడే నిషేదిత ఆల్ఫ్రాజోలం మత్తు పదార్ధాన్ని విరివిగా వాడుతున్నారని, ఇటీవలే కాలంలో ఇది సులువుగా దొరుకుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మాష్యూటికల్‌ ఫాక్టరీలలో లభ్యమయ్యే ఈ ఆల్ఫ్రాజోలం రాష్ట్రవ్యాప్తంగా వినియోగంలోకి రావడం ఇబ్బందికరంగా మారుతోంది. ప్రజల ప్రాణాలకు ఇది తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది.

ఈ కల్తీ కల్లు తయారీలో వినియోగించే ఆల్ఫ్రాజోలం వాస్తవంగా నిద్ర మాత్రల తాయిరీలో వాడుతారు. ఇది మానవ శరీరానికి తీవ్ర ప్రదామకరంగా వైద్యులు చెబుతున్నారు. తీవ్ర ఒత్తిడితో, ఇతర మానసిక సమస్యలతో నిద్రలేమికి గురైన 18ఏళ్ల పైబడిన వారికి ఆల్ఫ్రాజోలం మాత్రలను 0.5 మిల్లి గ్రాముల పరిమాణంలో, రోజుకు ఒకటి చొప్పున వాడాలని డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఈ మాత్రను ఎక్కువగా వాడితే శరీరంపై దీర్ఘకాలికంగా అనేక దుష్పరిణామాలు ఉంటాయి. నిద్ర పేరుతో దీనిని సులువుగా సంపాదిస్తూ కల్తీ కల్లులొ వాడుతున్నారు. చిన్న పరిసరాల్లో సులువుగా ఈ మత్తు మందును తయారు చేసే అవకాశం ఉండటంతో బీదర్‌నుంచి ఎక్కువగా తెలంగాణకు సరఫరా చేస్తున్నారు. కిలో ఆల్ఫ్రాజోలం తయారీకి రూ. 50వేలకుపైగా ఖర్చువుతుందని సమాచారం.

దీనిని మార్కెట్లో రూ. 3నుంచి రూ. 5లక్షలకు విక్రయిస్తున్నారు. అత్యధిక లాభాలు ఉండటంతో హైదరాబాద్‌ కేంద్రంగా ముఠాలు ఈ మత్తు మందును కల్తీ కల్లు తయారీదారులకు విక్రయిస్తున్నారు. ఈ మత్తు మందుకు వాడిన కల్లును తాగిన వాళ్‌లు త్వరగా ఇదే మందుకు బాసినలుగా అలవాటు పడిపోతారు. కేంద్ర నాడీ మండలం, మెదడుపై ఇది అత్యంత వేగంగా ప్రభావం చూపుతుంది. దీంతో ఇది వ్యసనంగా మారుతోంది. ఒక్కరోజు ఈ కల్లు దొరక్కపోయినా నిద్రపట్టని స్థితి చేరుతారు. ఆలస్యమైతే పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తారు. ఎక్కువ మొత్తంలో ఆల్ఫ్రాజోలం వాడిన కల్లును తాగితే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. గతంలో ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా అకున్‌ సబర్వాల్‌ ఉన్న సమయంలో దీని విక్రయాలు పూర్తిగా నిల్చిపోయేలా కఠినంగా వ్యవహరించారు. అయితే తాజాగా వీటిపై నిఘా కొరవడటంతో విక్రయాలు జోరందుకుని, కల్తీ కల్లు పెరిగిందని అంటున్నారు.

మరోవైపు అసలును మరిపించేలా చెలామణీ అవుతున్న కల్తీ మద్యం అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. విచ్చలవిడిగా పొరుగు రాష్ట్రాలనుంచి పన్ను చెల్లించని అనధికార మద్యం రాష్ట్రంలోకి జోరుగా దిగుమతి అవుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా కల్తీ మద్యాన్ని, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం…ఏ4 దుకాణదారులకు, బెల్ట్‌ షాపులకు చేరి భారీగా ప్రభుత్వ ఖజానాకు గండిపెడుతున్నాయి. అనధికారికంగా వీటి విలువ లక్షల కోట్లల్లో ఉంటుందని అంచనా. అయితే ఇటీవలీ దాడులు, నమోదైన కేసులు ఈ భారీ అక్రమ వ్యాపారాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. బెల్టు షాపుల్లో నమోదవుతున్న అనధికారిక విక్రయాల్లో ఎన్‌డీపీతోపాటు ఒక రకం మద్యాన్ని మరో రకం మద్యం సీసాల్లో నింపి విక్రయించేదే అధికమని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అనుమానిస్తోంది.

క్యాప్‌లతో గోల్‌మాల్‌….

- Advertisement -

రాష్ట్రంలో కల్తీ రహిత మద్యానికి 1998లో ఏపీబీసీఎల్‌ గోలా క్యాప్‌లను అమలులోకి తెస్తూ నిర్ణయం తీసుకొంది. వీటి అమలుతో కల్తీకి చెక్‌ పడుతుందని ప్రభుత్వం యోచించింది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. కొత్త విధానంలో ఇతర రాష్ట్రాలనుంచి పన్ను చెల్లించని మద్యాన్ని రాష్ట్రానికి తరలిస్తున్న ముఠాలు ప్రముఖ బ్రాండ్ల ఖరీదైన మద్యం ఖాళీ సీసలను కొనుగోలు చేసి వాటిలో తక్కువ రేటు మద్యాన్ని నింపివేస్తున్నారు. వీటిని ఎక్కువ వ్యాపారం జరిగే మద్యం దుకాణాలకు, బార్లకు, బెల్టు షాపులకు అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన మందుబాబులు నిలువునా మోసపోతున్నారు.

హైదరాబాద్‌ కేంద్రంగా ముఠాలు…

తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ముఠాలు విస్తరించాయి. ఇతర రాష్ట్రాలనుంచి మద్యాన్ని తక్కువ ధరకు కొనుగోలుచేసి కల్తీ చేయడంతోపాటు, తక్కువ ధరకు వీటిని వ్యాపారులకు విక్రయించడం ఈ ముఠాలకు నిత్యకృత్యంగా మారింది. వీరికి సహాయకారిగా ఏజెంట్లు కూడా పనిచేస్తుండటం మరో విశేషం. ఈ ముఠాలు నెలకు కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారం చేస్తోందని ఒక అంచనా. ఇందుకు హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఈ ముఠాలు తమతమ సభ్యులతో కావాల్సిన చోటికి మద్యం సరఫరా చేస్తున్నారని వినికిడి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక నెట్‌వర్క్‌ పనిచేస్తోందని ఎక్సైజ్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఎక్కని కిక్కు…

ప్రధానంగా మద్యం దుకాణాల్లో ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని కొనుగోలుచేసిన మందుబాబులు కిక్కు ఎక్కడంలేదని ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇందుకు కల్తీ మద్యమే కారణమని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అంటోంది. మన రాష్ట్రంకంటే పొరుగు రాష్ట్రాల్లో బీరు, మద్యంపై ధరలు 5రెట్లు తక్కువగా ఉండటం కూడా ఎన్‌డీపీ తరలింపుకు ప్రధాన కారణమని ఆయా వర్గాలు అంటున్నాయి. బార్లలో మొదటి పెగ్గు అసలు మద్యమే సర్వ్‌ చేస్తున్నారని…తర్వాతే కల్తీ మద్యం ఇచ్చి మందుబాబులకు తెలియకుండా మోసం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఎంత తాగినా కిక్కు ఎక్కడంలేదనే ఫిర్యాదులు తరచుగా వస్తున్నాయని ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.

పక్క రాష్ట్రాలనుంచి…

కర్నాటక, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, హర్యానా, పాండిచ్చేరి, తదితర రాష్ట్రాలనుంచి యధేచ్చగా మద్యం దిగుమతి అవుతోంది. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌లో కల్తీలు చేసి వీటిని ఇతర ప్రీమియం బాటిళ్లలో నింపడం…దేశీయ మద్యంలో నింపి సొమ్ము చేసుకోవడం, ఇతర రాష్ట్రాలనుంచి రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ను తెచ్చి ఇక్కడ కల్తీ చేస్తున్న ముఠాలు పెరిగాయి. మన రాష్ట్రంలో కూడా ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ ఉత్పత్తి అవుతోంది. మొలాసిస్‌ను ఉడకబెడితే ఆర్‌ఎస్‌ తయారువుతుంది. ఆర్‌ఎస్‌ను మూడుసార్లు వేడిచేస్తే ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ తయారవుతుంది. పక్క రాష్ట్రాలనుంచి అనుమానం రాకుండా ఆర్‌ఎస్‌ను కొనుగోలు చేసి అందులో నీటిని కలిపి దొంగ లేబుళ్లతో రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఈ ఘాటైన ఆర్‌ఎస్‌లో 50లీటర్లకు 500 లీటర్ల నీటిని కలిపి ప్రముఖ బ్రాండ్ల ఖాళీ సీసాల్లో నింపి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పొరుగున ఉన్న హర్యానా, గోవా రాష్ట్రాల్లో బీర్‌, మద్యం ధరలు తెలుగు రాష్ట్రాలకంటే ఐదు రెట్లు తక్కువ. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న తెలుగు రాష్ట్రాలకు తరలించడం కూడా అక్రమార్కులకు వరంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement