Thursday, April 25, 2024

Harish Rao: దివాళా అని రాష్ట్ర ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే….ఎలాః ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన హ‌రీష్ రావు

హైద‌రాబాద్ – రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్‌ నాయకులు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందని హరీశ్‌రావు అన్నారు. సువిశాలమైన ప్రగతి దారులను నిర్మించిందన్నారు.

కొత్త ప్రభుత్వం ఆ దారుల వెంట ముందడుగు వేస్తూ ప్రజలే కేంద్రంగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఆర్థిక శ్వేత‌ప‌త్రంపై ఆయ‌న ఆసెంబ్లీలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా.. అంకెల గారడితో ఉందని అన్నారు. రాజకీయ కక్షల చుట్టూ పరిభ్రమించే వైఖరికి భిన్నంగా.. అభివృద్ధి కక్షలో పరిభ్రమిస్తే వారికి మంచిద‌ని.. ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఇంకా మంచిదని సూచించారు. కానీ ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు, శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు, ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థులపై దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనిపిస్తుందన్నారు.

ఈ శ్వేత‌ప‌త్రం అంతా గత ప్రభుత్వంపై బురదజల్లేలా ఉందన్నారు. అలాగే హామీల నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుకుతున్నట్లు కనిపిస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా, ఆరోగ్యకరంగా ఉందని అనేక రాజ్యాంగబద్ధ సంస్థల నివేదికలు తేల్చిచెబుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తుందన్నారు. తద్వారా రాష్ట్ర ప్రతిష్ఠ, పరపతి, ప్రతిపత్తిని, భవిష్యత్తు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతుందని గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే దాని పర్యవసనాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని హరీశ్‌రావు అన్నారు. ఇది కూర్చున్న కొమ్మనే నరుక్కునేటువంటి అవివేకమైన చర్య అని అన్నారు. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే.. మార్కెట్‌లో తెలంగాణకు ఏర్పడిన విశ్వసనీయత దెబ్బతింటుందని.. పెట్టుబడులు రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం కింద ఇచ్చే 3 శాతం రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి. మన బాండ్లకు డిమాండ్‌ తగ్గుతుందన్నారు.
దివాళా.. దివాళా అని రాష్ట్ర ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే.. రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా? అని ప్రశ్నించారు. దివాళా తీసిన రాష్ట్రం నీళ్లు ఇవ్వగలదా? కరెంటు ఇవ్వగలుగుతుందా? అనే అపోహలు తలెత్తుతాయన్నారు. పర్యవసనంగా పెట్టుబడులు ఆగి.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇదే గోబెల్స్‌ ప్రచారం చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారం కోసం.. మాపై బురదజల్లే ప్రయత్నం చేశారని అర్థం చేసుకుంటాం.. కానీ ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం, అన్యాయం, మూర్ఖత్వం అని హ‌రీష్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర కీర్తిని, పరపతిని పెంచామని హరీశ్‌ రావు అన్నారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లే ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉన్న రాష్ట్రాన్ని.. కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా, దివాళా రాష్ట్రంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీరు విడుదల చేస్తున్నది శ్వేత పత్రాలా? లేక మీరిచ్చిన హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న పత్రాలా? అని అనుమానం కలుగుతుందన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు, ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతో ఎగవేతలకు, కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేతపత్రాల అంతర్యం అని చెప్పకనే చెబుతున్నట్లు అనిపిస్తుందని అన్నారు. అయినా శ్వేతపత్రాల్లో చెప్పిన వివరాలేవీ కొత్తవేమీ కావని అన్నారు. కొండను తవ్వి ఎలుకను బట్టినట్టు కొత్తగా చెబుతున్నారు.. కానీ దీనిపై ఇదే శాసనసభలో చర్చించామని గుర్తు చేశారు. మామీద బురదజల్లే ప్రయత్నం తప్ప.. ఇందులో కొత్త విషయాలేమీ కనిపించడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement