Friday, May 3, 2024

టి ఎస్ పి ఎస్ సీలో ఇంత డొల్లత‌న‌మా…ఛైర్మ‌న్ ను నిల‌దీసిన సిట్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందనీ సిట్‌ అభిప్రాయ పడింది. పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన ఉద్యోగ నియామక పరీక్షలను తేలిగ్గా తీసుకున్నట్లు గుర్తిం చింది. ప్రశ్నాపత్రాల కూర్పు మొదలుకుని చివరి దాకా ముందుజాగ్రత్త చర్యలేవీ తీసుకోలేనందునే కిందిస్థాయి ఉద్యోగులు సునాయాసంగా పేపర్లను పథకం ప్రకారం అమ్ముకున్నట్లు సిట్‌ విచారణలో బహిర్గతమైంది.
టీ-ఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) చేస్తున్న దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ నెల 11న పేపర్‌ లీకేజీపై ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చేందుకు సిట్‌ రంగం సిద్ధం చేసినట్టు- సమాచారం. కాగా సర్వీస్‌ కమిషన్‌ అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జనార్దన్‌ రెడ్డి వాగ్మూలాన్ని సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ నమోదు చేశారు. నాంపల్లిలోని టీ-ఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వచ్చిన శ్రీనివాస్‌ బృందం మూడు గంటలపాటు- విచారించి కమిషన్‌లో విధుల నిర్వహణ, చైర్మన్‌, కార్యదర్శి, సభ్యులకున్న అధికారాలు, విధులు, బాధ్యతలు, ప్రశ్నపత్రాల కూర్పు, ప్రశ్నల నిధి అమలు, పరీక్షా కేంద్రాల ఏర్పాటు,- మూల్యాకనం, ఫలితాల ప్రకటన తదితర అంశాలపై సిట్‌ జనార్దన్‌ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు- తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డిని పిలిచి విచారించిన సిట్‌ వారు ఇచ్చిన వాగ్మూలాన్ని జనార్దన్‌ రెడ్డి ముందుంచి ఆరా తీసినట్టు- సమాచారం.

ప్రశ్నపత్రాల కూర్పు, ముద్రణ, కంప్యూటర్లలో వాటిని పొందుపరిచి అందుకు సంబందించిన పాస్‌వర్డ్‌ను చైర్మన్‌ తన వద్దే ఉంచుకుని పర్యవేక్షిస్తారని అనితా రామచంద్రన్‌ సిట్‌కు వివరించడంతో ఆ దిశగానే ఏఆర్‌ శ్రీనివాస్‌ సోమవారం జనార్దన్‌ రెడ్డిని విచారించినట్టు- ప్రచారం జరుగుతోంది. కమిషన్‌కు చెందిన పోటీ- పరీక్షల రహస్య సమాచారం ఎవరి వద్ద ఉంటుందని, రోజువారీ పర్యవేక్షణ ఎలా?… ఎవరు చేస్తారని అడిగినట్టు- చెబుతున్నారు. ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మొదలు.. ఫలితాల ప్రకటన ఉద్యోగాలకు ఎంపి-కై-న వారి జాబితాను సిద్ధం చేసి ఆయా ప్రభుత్వ శాఖలకు పంపించేంత వరకు అమలు చేస్తున్న ప్రక్రియపై సిట్‌ చీఫ్‌ కూపీ లాగినట్టు- చెబుతున్నారు. ఇప్పటిదాకా ఎన్ని పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేశారు.. ఎప్పుడెప్పుడు వాటిని ప్రకటించారు.. ఎంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు..? వంటి వివరాలను సేకరించినట్టు- సమాచారం. సర్వీస్‌ కమిషన్‌లో శాశ్వత ఉద్యోగులు ఎంతమంది.. వారు ఏఏ విభాగాల్లో పనిచేస్తున్నారు.. ఎంత కాలంగా విధులు నిర్వహిస్తున్నారు..? అనే వివరాలను కూడా సేకరించారు. పొరుగు సేవల ద్వారా ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు.. ఎంత కాలంగా వారు పనిచేస్తున్నారు.. వీరిలో మహిళలు ఎంత మంది.. వారికి కేటాయించిన విభాగాలు ఏంటి? అని కూడా అడిగినట్టు- సమాచారం.

రహస్య విభాగంలో డొల్లతనంపై అసంతృప్తి?
ప్రశ్నపత్రాల కూర్పు, ముద్రణ, వాటిని కంప్యూటర్లలో అప్‌లోడ్‌ చేసే సమయంలో తీసుకోవలసిన ముందస్తు చర్యలు, జాగ్రత్తలపై ఆరా తీసిన సిట్‌ చీఫ్‌ శ్రీనివాస్‌ అందులో ఉన్న డొల్లతనంపై ప్రశ్నించినట్టు- సమాచారం. కాన్ఫిడెన్షియల్‌ విభాగానికి శంకర లక్ష్మిని ఇన్‌చార్జ్‌గా నియమించే సమయంలో తీసుకున్న జాగ్రత్తలేంటి? ఆమె పూర్వాపరాలు తెలిసుకున్నారా? ఓ బాధ్యత గల పదవిలో ఉన్న ఆమె కంప్యూటర్‌ పాస్‌వర్డ్‌ను పుస్తకంలో రాసి ఆ పుస్తకాన్ని భద్రంగా దాచిపెట్టాల్సింది పోయి దాన్ని అందుబాటు-లో ఉంచడంతో ఇదే అదనుగా భావించిన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ 15 ప్రశ్నపత్రాలను కంప్యూటర్‌ నుంచి కొట్టేసి బహిరంగ మార్కెట్లో విక్రయించిన వైనాన్ని సిట్‌ చీఫ్‌ బయటపెట్టినట్టు- తెలుస్తోంది. కమిషన్‌ ఉద్యోగులు కీలకమైన గ్రూప్‌-1 పరీక్ష రాస్తుంటే వారిపై నిఘా పెట్టాల్సిన విషయం మరచిపోయారా? లేక ఉద్దేశ పూర్వకంగా చేశారా? అని నిలదీసినట్టు- సమాచారం. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్‌.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసి 103 మార్కులు సాధించిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? లీకేజీకి ముందా.. తర్వాతా..? ఇంతకీ ఎంతమంది కమిషన్‌ ఉద్యోగులు పోటీ- పరీక్షలకు హాజరయ్యారన్న కోణంలో సిట్‌ సమాచారం సేకరించిందని చెబుతున్నారు.

ఇప్పటి వరకు వందమందిని విచారించిన సిట్‌
గ్రూప్‌-1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో వందకుపైగా మార్కులు సాధించినవారిలో ఇప్పటి వరకూ వందమందిని విచారించి.. వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇప్పటివరకూ ప్రశ్నపత్రం లీక్‌ చేసిన ప్రవీణ్‌, రాజశేఖర్‌ ద్వారా పరీక్ష రాసిన వారితో సహా మొత్తం 15మందిని అరెస్టు చేశారు. ఎంత మందికి ప్రశ్నపత్రాలు చేరాయి..? వారి ద్వారా ఎవరికి నగదు అందిందనే కోణంలో సిట్‌ అధికారులు వారిని ప్రశ్నించి సమాచారం సేకరించారు.

- Advertisement -

ఇలా లీక్‌ జరిగింది
ప్రశ్నపత్రం ఎలా లీక్‌ అయిందనే విషయమై ఇప్పటికే స్పష్టత వచ్చింది. కాన్ఫిడెన్సియల్‌ విభాగం ఇన్‌చార్జ్‌ శంకరలక్ష్మి దగ్గర యూజర్‌ ఐడీ, పాస్వర్డ్‌ కొట్టేసి ప్రశ్నపత్రాలు తస్కరించినట్లు- దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. కాన్ఫిడెన్షియల్‌ విభాగం మొత్తం కార్యదర్శి ఆధీనంలో ఉంటు-ంది. ప్రశ్నాపత్రాల తయారీ, భద్రత, పరీక్షల నిర్వహణ తదితర విషయాల గురించి కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను సిట్‌ ఇప్పటికే విచారించి వివరాలు రాబట్టింది.
ఇప్పటికే సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌, కార్యదర్శి నుంచి సిట్‌ పలు వివరాలు సేకరించింది. వివిధ ఉద్యోగ నియామక పరీక్షలు ఎలా నిర్వహిస్తారు.. ప్రశ్నాపత్రాలు ఎవరు రూపొందిస్తారు.. వాటిని ఎక్కడ భద్రపరుస్తారు.. ఎవరెవరి ఆధీనంలో ప్రశ్నాపత్రాలు ఉంటాయనే వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. టీ-ఎస్‌పీఎస్‌సీ పరిపాలన విభాగం సహాయ కార్యదర్శి సత్యనారాయణతో పాటు-.. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ అధికారి శంకరలక్ష్మిని.. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సాక్ష్యులుగా చేర్చారు. ప్రశ్నపత్రాల లీకేజీలో టీఎస్‌పీఎస్‌సీకి చెందిన నలుగురు ఉద్యోగులను సిట్‌ అరెస్ట్‌ చేసింది. కమిషన్‌కి చెందిన 20 మంది గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాయగా 8 మంది మెయిన్స్‌కి అర్హత సాధించారు. షమీమ్‌, రమేశ్‌, సురేశ్‌కి 100కు పైగా మార్కులొచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్నపత్రాలున్నట్లు- సిట్‌ దర్యాప్తులో తేలింది. గ్రూప్‌-1, ఏఈఈ, డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి.. ఏఈ పరీక్షలతోపాటు- టౌన్‌ప్లానింగ్‌, జేఎల్‌ పరీక్షలకు చెందిన ప్రశ్నపత్రాలున్నట్లు- గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement