Monday, April 29, 2024

గొర్రెల పంపిణీ పూర్తి స్థాయిలో జరగాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా..

జయశంకర్ భూపాలపల్లి, (ప్రభాన్యూస్): జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తిస్థాయిలో జరిగేలా భాద్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పశుసంవర్ధకశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పశుసంవర్ధకశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఆ శాఖ ద్వారా జిల్లాలో అమలుచేస్తున్న కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. జిల్లాలో పాడి పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల అభివృద్ధికి పశుసంవర్ధక శాఖ ద్వారా కృషి జరుగుతుందని దానిలో భాగంగా ప్రతి సంవత్సరం టీకాలు, నట్టల నివారణ మందులను వేస్తున్నామని అన్నారు.

జిల్లాలో 155 గొర్రెల పెంపకం దారుల సొసైటీలు ఉండగా జిల్లాకు 12785 సబ్సిడీ గొర్రెల యూనిట్లు మంజూరు అయ్యాయని వాటిలో మొదటి విడతగా 6351 యూనిట్లను అందించడం జరిగిందని రెండో విడతలో డీడీలు తీసిన లబ్ధిదారులకు నెల్లూరు, నంద్యాలలో గొర్రెల యూనిట్లను కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ప్రస్తుతం లబ్ధిదారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి గొర్రెలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 500 పెరటి కోళ్ల యూనిట్లు మంజూరు కాగా 488 యూనిట్లను అందించడం జరిగిందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్. కుమారస్వామి వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంతో పాటు పశు సంపదతో అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లాలో పశు సంపద అభివృద్ధికి పశుసంవర్ధక శాఖ అధికారులు కృషి చేయాలని అన్నారు. రెగ్యులర్గా వ్యాక్సినేషన్ వేయడంతోపాటు రైతులకు పశుసంపద నిర్వహణపై తరచుగా సలహాలు, సూచనలు అందచేయాలని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు అందరికీ సబ్సిడీ గొర్రెల యూనిట్లు అందేలా చూడాలని, గొర్రెల యూనిట్లు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, నంద్యాల నుండి తీసుకువచ్చేందుకు వెళ్లే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు సంబంధిత రాష్ట్ర స్థాయి గొర్రెల పంపిణీ టీంతో అనుసంధానం చేస్తూ క్షేమంగా జిల్లాకు గొర్రెలను తీసుకువచ్చేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.

అదేవిధంగా సభ్యులతో గొర్రెలు, పెరటి కోళ్లను పొందిన లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితులు ఎలా మెరుగైంది ఎప్పటికప్పుడు తెలుసుకొని విజయగాథ రూపంలో నివేదిక అందించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెరటి కోళ్ల పెంపకం పథకానికి జిల్లాలో 90 యూనిట్లు మంజూరై దాదాపు కోటి రూపాయల నిధులు కూడా అందుబాటులో ఉన్న ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక కాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసి త్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ ఏడి శ్రీదేవి, పశు వైద్యులు, పశుసంవర్ధకశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement