Sunday, May 5, 2024

రైల్వేలో జాబ్స్​ పేరుతో మోసాలు. నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారతీయ రైల్వేలోని వివిధ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను కొందరు దళారులు మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైల్వేలో అన్ని రకాల ఉద్యోగాల నియామకాలను కేవలం ఆర్‌ఆర్‌బి, ఆర్‌ఆర్‌సి ద్వారా మాత్రమే పారదర్శకంగా జరుపుతామని దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జ్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపూరిత వాగ్ధానాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

ఆర్‌ఆర్‌బి, ఆర్‌ఆర్‌సి ద్వారా ఉద్యోగ ప్రకటనలు వెలువరించిన తర్వాతే నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తామన్నారు. ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీ, ఎస్‌సీఆర్‌ వెబ్‌సైట్ల ద్వారా తెలియజేస్తామన్నారు. రైల్వే ఉద్యోగాలను నేరుగా పొందడానికి ఎలాంటి దగ్గర దారులు ఉండవనే విషయాన్ని నిరుద్యోగులు గమనించాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement